TDP Janasena Alliance First Meeting : వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీ కీలక సమావేశం నేడు జరగనుంది. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న రాజమండ్రి జైలుకు.. కూతవేటు దూరంలోని మంజీరా కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలి భేటీ జరగనుంది. పవన్ కల్యాణ్, లోకేశ్ (Pawan Kalyan, Lokesh) అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... పొత్తు బంధాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే ముఖ్య నిర్ణయాలు తీసుకుని ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఉమ్మడి పోరాటం.. రాష్ట్రంలో 2024 ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చి, రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే పరిణామాలకు సంబంధించిన కీలక భేటీకి తెలుగుదేశం, జనసేన విజయదశమి పర్వదినాన్ని ఎంచుకున్నాయి. వైసీపీ (YSRCP) ప్రభుత్వ అరాచకాలు, ప్రజావ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని... వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన ఇరు పార్టీలు ఆ ప్రక్రియను మరింత వేగంగా ముందుకి తీసుకెళ్లేందుకు భేటీలో చర్చించనున్నాయి. ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీల మధ్య మరింత విస్తృత సమన్వయంపై కమిటీ చర్చించనుంది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ మరింత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా... నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల తరపున కమిటీ సభ్యుల్ని ప్రకటించారు. టీడీపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్యను నియమించగా... జనసేన నుంచి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), కందుల దుర్గేశ్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు సభ్యులుగా ఉన్నారు.
ఇరు పార్టీల ధీమా... 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ, జనసేన మొదటి నుంచీ వేర్వేరుగా పోరాడుతున్నాయి. వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే రెండు పార్టీల ఉమ్మడి అజెండా కావడం, ఒకే లక్ష్యంతో పోరాడుతుండటంతో... రెండు పార్టీల మధ్య మళ్లీ సన్నిహిత వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు అరెస్టు వేళ... తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్‌కల్యాణ్ ప్రకటించడంతో ఇరుపార్టీల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ, జనసేన కలసి పనిచేస్తాయని అగ్రనేతలు ప్రకటించినా.... ఇప్పటివరకు ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించలేదు. తెలుగుదేశం నిర్వహించే కార్యక్రమాలకు జనసైనికులు మద్దతు తెలపటం, జనసేన కార్యక్రమాలకు తెదేపా శ్రేణులు తమవంతు సంఘీభావం తెలపటం వంటివి మాత్రం కొనసాగుతున్నాయి. ఐక్య పోరాటంపై ఇంతకాలం స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో... కింది స్థాయి నాయకులు, కేడర్‌లో కొన్ని సంశయాలుండేవి. నేటి సమావేశంలో అవన్నీ తొలగిపోతాయని ఇరు పార్టీల శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి సమావేశాలు రెండు పార్టీల్లోనూ కిందిస్థాయి కేడర్ కలసి పనిచేసేలా మానసికంగా సిద్ధమయ్యేందుకు, అవగాహనతో పనిచేయడానికి దోహదం చేస్తాయని ఇరు పార్టీల నేతలూ భావిస్తున్నారు.
TDP-JanaSena Coordination Committee: జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యులతో టీడీపీ కమిటీ ఏర్పాటు..