అమలాపురం పట్టణం 1940లో ఏర్పడింది.ఈ పట్టణం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా, రెవెన్యూ డివిజన్‌గా ఉంది. 53 వేలకుపైగా జనాభా ఉన్న పట్టణంలో సుమారు 40 వేల మంది ఓటర్లు ఉన్నారు. అమలాపురం మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించారు. 15మంది ఛైర్మన్లు బాధ్యతలు నిర్వరించగా....వీరిలో కేవలం ఒక్క మహిళ కళ్వకొలను ఛాయాదేవి మాత్రమే మహిళా ఛైర్ పర్సన్ గా సేవలు అందించారు. 1995 తర్వాత తిరిగి ఈ సారి మున్సిపల్ ఛైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.
ప్రస్తుతం 30 వార్డుల్లో 6 ఏకగ్రీవమవ్వగా.... అన్నీ వైకాపా అభ్యర్థులే గెలుచుకున్నారు. మిగిలిన వార్డుల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెదేపా, జనసేన ధీమాతో ఉండగా....తొలిసారి పట్టణంలో పాగా వేయాలని వైకాపా పట్టుదలతో ఉంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్ అన్నీ తానై వైకాపా తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెదేపా తరఫున సీనియర్ నేతలు చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, ఆనందరావు ప్రచారం చేస్తున్నారు.
అమలాపురం సమస్యల నిలయంగా మారింది. పెరిగిన జనాభాకు తగినట్లుగా రహదారులు విస్తరణ లేక, ఇరుకు దారుల్లో ట్రాఫిక్ సమస్యలతో జనం విసుగెత్తిపోతున్నారు. గతుకులమయమైన రహదారుల్లో దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నారు. పట్టణంతో పాటు శివారు ప్రాంత కాలనీల్లోనూ తాగు నీటి సమస్య వేధిస్తోంది. మరో మూడు వాటర్ ట్యాంకులు అవసరం ఉందని తేల్చారు. డంపింగ్ యార్డ్ లేదు. చెత్తకు ఎప్పటికప్పడు నిప్పుపెడుతున్నారు.శ్మశాన వాటిక చెత్తతో నిండిపోతోంది.
అంతిమ సంస్కారాలు నిర్వహణ ఇబ్బందిగా మారింది శివారు ప్రాంతాలు పట్టణంలో కలిసిపోయినా....వాటి విలీనం వ్యవహారం పెండింగ్‌లోనే ఉంది. ఫలితంగా అమలపురం పట్టణ విస్తర ప్రణాళికాబద్ధంగా సాగడం లేదు. ప్రముఖ పట్టణమైన అమలాపురంలో పీఠం దక్కించుకునే వారు ఎవరైనా.... దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
ఇదీ చదవండి: