East Godavari Same Clan Get Together: ఒకే ఇంటి పేరుతో ఉన్న వారందరూ ఒక చోట కలిస్తే బాగుంటుందని మనలో చాలా మందికి కలిగే ఆలోచన. అలా కలుసుకొని అందరితో పరిచయం పెంచుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంటుంది. ఇలాంటి ఆలోచనే తూర్పుగోదావరి జిల్లాలో తాడి వంశీయులకు వచ్చింది. అనుకున్న వెంటనే ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న తాడి వంశీయులను ఆహ్వానించారు. సంక్రాంతి పండుగ ఇందుకు వేదికైంది. సుమారు 70 కుటుంబాలకు చెందిన 400 మంది ఇలా కలుసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.
విదేశాల నుంచి వచ్చి : ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఒకే ఊరిలో ఉన్నవారినే కలవడానికి సమయం దొరకని పరిస్థితి. కానీ దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం తమ వంశీయులను కలుసుకునేందుకు ఇక్కడికి రావడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలోని తాడి వంశీయులు ఒకే చోట కలిశారు. సుమారు 70 కుటుంబాలకు చెందిన 400 మంది ఒకే చోట కలుసుకుని ఆనందంగా గడిపారు.
ఆకర్షణగా 12 తరాల వంశ వృక్షం : వారి వంశంలో వారికి తెలిసిన వారి పలకరింపులు.. తెలియని వారి పరిచయాలు వారి ఆత్మీయ కలయిక వేదిక వద్ద సంతోషంలో మునిగి తేలారు. ఇందులో వారి వంశానికి చెందిన 12 తరాల వంశవృక్షాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి పిల్లలకు వారి గురించి వివరించుకుంటు తల్లిదండ్రులు, పెద్దలు మురిసిపోయారు.
ఆటల పోటీలతో ఆనందం : వారంతా ఒక చోట కలుసుకుని పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నం కదా కేవలం పిల్లలకే అయితే ఎలా అనుకున్నారేమో.. పెద్దలకూ ఆటల పోటీలు నిర్వహించుకుని విజేతలకు బహుమతులు అందించుకున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులను సత్కరించుకున్నారు.
ఇవీ చదవండి :