రాజమహేంద్రవరంలోని రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. గుంతలతో, బురదతో నిండిన రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. తరచూ దెబ్బతింటున్న రహదారులకు.. నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. మళ్లీ కొన్నిరోజులకే గుంతలు, దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బాలాజీపేట, హుకుంపేట రహదారులు ప్రమాదకరంగా మారాయి. వాహనదారులతో పాటు సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా ఉన్న తూర్పు రైల్వేస్టేషన్ - ఆవ రోడ్డు విస్తరణకు పలుసార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నగరంలో దెబ్బతిన్న రహదారులకు గతంలో తాత్కాలిక మరమ్మతులు చేశారు. అవి మళ్లీ గోతులమయంగా మారాయి. చర్చి గేటు వద్ద ప్రధాన రహదారి, నందం గని రాజు కూడలి నుంచి ఆర్ట్స్ కళాశాల రోడ్డు, తిలక్ రోడ్డు దారుణంగా తయారయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు మధ్యలోనే వదిలేశారు.
రాజమహేంద్రవరం - సీతానగరం ఆర్అండ్బీ ప్రధాన రహదారి పలుచోట్ల చెరువులను తలపిస్తోంది. ఇసుక లారీల రాకపోకలతో పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.
అసలే అధ్వాన రహదారులు.. ఆపై వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని రహదారులు రూపురేఖలు కోల్పోయాయి. అధికారులు పరిశీలించి అవస్థలు తీర్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: అధ్వానంగా రోడ్లు... 'అనంత' కష్టాల్లో ప్రయాణికులు