ఉభయ గోదావరి జిల్లాలకు తలమానికమైన రాజమహేంద్రవరం విమానాశ్రయం వందల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులతో మొదలై... లక్షలకు చేరి ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నిరుడు కొవిడ్ ధాటికి తన వైభవాన్ని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రయాణికుల రాకపోకలు జోరందుకున్న వేళ.. సర్వీసులు పెరిగి విమానయానం పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది.
కొవిడ్‌కు ముందు..
ఏడాదికి 4 లక్షల మందికిపైగా రాకపోకలు సాగించే.. విమానాశ్రయంగా రాజమహేంద్రవరం గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి వరకు గ్రేడు- 4లో ఉన్న విమానాశ్రయం గ్రేడు-3తో ఉన్నతి సాధించింది. 2019-20లో 4.4 లక్షల మంది రాకపోకలతో రికార్డు స్థాయికి చేరింది. ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 22 విమాన సర్వీసుల రాకపోకలతో దూసుకెళ్లింది.
త్వరలో పెద్ద సర్వీసులు
కొవిడ్ తర్వాత 2 నుంచి 18 సర్వీసులు పెరిగాయి. బోయింగ్, కార్గో విమానాలు, దిల్లీ, ముంబయి, షిర్డీ వంటి దూర ప్రాంతాలకు సర్వీసులు పరిస్థితులు అనుకూలించాక అందుబాటులోకి రానున్నాయి.
రివ్వున ఎగిరే..
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొవిడ్‌కు ముందు ఉన్న సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా చెన్నైకు ఒకటి, హైదరాబాద్‌కు ఒక సర్వీసు పెరగగా, ఈ నెల 13 నుంచి ట్రూజెట్ విమానయాన సంస్థ సేవలు ఆరంభించింది. వెరసి హైదరాబాద్‌కు ఆరు, బెంగళూరుకు రెండు, చెన్నైకు ఒకటి చొప్పున సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
కరోనాతో కలవరం
రెండు జిల్లాల్లో ఉన్న ఏకైక విమానాశ్రయం.. ప్రయాణికుల రద్దీతో సర్వీసులు పెరిగే వేళ కొవిడ్ దెబ్బతీసింది. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి పెద్దపెద్ద విమాన సర్వీసుల నిర్వహణకు సమయం ఆసన్నమై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇంతలోనే కొవిడ్ తొలి దశ ఉద్ధృతితో 2020 మార్చి 26 నుంచి మొత్తం సర్వీసులు ఆపేశారు. రెండు నెలల తర్వాత మే 26 నుంచి ఒక్కో సర్వీసు పునరుద్ధరించారు.
ప్రయాణాల్లో గణనీయ పురోగతి
విమానాశ్రయంలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు. కొవిడ్ నేపథ్యంలోనూ గతంతో పోలిస్తే 50 % ప్రయాణికులను రాబట్టగలిగాం. పూర్వపు సర్వీసులను పెంచుతూ.. మరిన్ని పెద్ద విమానాల సర్వీసుల రాకపోకలు నిర్వహించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. - మనోజ్‌కుమార్, విమానాశ్రయం డైరెక్టర్
నిబంధనల అమలు ఇలా..
ఇదీ చదవండి: