ఆడుకోవల్సిన వయసులో తలసేమియా బారిన పడిన చిన్నారులు నెలకోసారి ఆస్పత్రుల చూట్టూ తిరగాల్సి వస్తోంది. బాధితులంతా నెలకోసారి రక్తం తప్పకుండా ఎక్కించుకోవాల్సిందే...వీరి కోసం ప్రభుత్వం , రెడ్ క్రాస్ వంటి సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. ఆ చిన్నారుల జీవితాల్లో ఆనందం నింపుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ కాకినాడలో తలసేమియా కేర్ సెంటర్ నిర్వహిస్తూ చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారి కాకినాడలో ఈ సేవలు ప్రారంభించిన రెడ్ క్రాస్... ఇప్పుడు ఏలూరు, నెల్లూరులోనూ బాధితులకు సేవలందిస్తోంది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. ఇప్పటివరకు 129మంది బాలల పేర్లు ఈ కేంద్రంలో నమోదయ్యాయి. ప్రస్తుతం 18 పడకలతో ఈ సెంటర్ నిర్వహిస్తున్నారు.
2017ఏప్రిల్ లో ప్రారంభమైన ఈ కేంద్రంలో ఇప్పటివరకూ 14 వందల 3యూనిట్ల రక్తం అందించారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి సైతం బాధిత చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు రక్తం కోసం వస్తున్నారు. రెడ్ క్రాస్ సంస్థ ఇలా ఉచితంగా రక్తం అందిస్తూ తమకెంతో సాయపడుతోందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాకినాడ రెడ్ క్రాస్ కేంద్రం అందిస్తున్న సేవలను తలసేమియా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ నిర్వాహకులు కోరుతున్నారు.
తలసేమియా బాధిత బాలలకు నిత్యం రక్తం ఎక్కించడం వల్ల ఐరన్ శాతం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. శరీరంలో ఐరన్‌ను ఎప్పటికప్పుడు సమతుల్యతలో ఉంచేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: