తూర్పుగోదావరి జిల్లాలో పెండింగ్ బియ్యం కార్డులపై కదలిక వచ్చింది. తెల్లరేషన్‌కార్డుల స్థానంలో బియ్యం కార్డులను వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెల్లరేషన్ కార్డులో సభ్యులుగా ఉండి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా, 4 చక్రాల వాహనం ఉన్నా, ఎక్కువ మొత్తంలో విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నా, పట్టణాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సొంత ఇల్లు ఉన్నవారికి బియ్యం కార్డులు ఇవ్వలేదు.
జిల్లాలో 16,50,610 తెల్లరేషన్‌కార్డులకు 1,06,050 మందికి బియ్యం కార్డులు జారీ చేయలేదు. దీంతో పలువురు అర్హులు సైతం పింఛన్లు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో 1,06,050 పెండింగ్ కార్డులపై సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించి వాలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. బియ్యం కార్డుకు అర్హత ఉంటే నిలిపివేసిన వాటిని పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
అర్హులందరికీ మంజూరు చేస్తాం
దీనిలో భాగంగా ఆదివారం సంయుక్త కలెక్టర్ జి. లక్ష్మీశ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రామారావుపేట, ఇంద్రపాలెం ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు సచివాలయంలో సర్వేలో గుర్తించిన వివరాలను ఆన్‌లైన్ చేసే ప్రక్రియను తనిఖీ చేశారు. బియ్యం కార్డులు పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. గ్రామాల్లో వాలంటీర్లు, వీఆర్వోలతో మరోసారి సర్వే చేయిస్తున్నామని, అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని జేసీ లక్ష్మీశ పేర్కొన్నారు. విద్యుత్తు బిల్లులు ఎక్కువగా రావడం, అంతర్జాలంలో తప్పుగా నమోదవటంతో చాలామంది అర్హులు ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాద్, ఏఎస్‌వో సురేష్, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి.. ఉప్పాడ చేపల రేవులో 350 కోట్లతో హార్బర్