అఖండ గోదావరి తీరంలో అలరారుతున్న రాజమహేంద్రవరానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాజరాజనరేంద్రుడు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. వేంగి చాళుక్య పాలనలో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యం సంతరించుకుంది. కాకతీయ సామ్రాజ్యంలోనూ ప్రశస్తి పొందింది. ఆ తర్వాత రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజుల ఏలుబడిలో రాజమహేంద్రవరం అభివృద్ధి చెందింది. తురుష్కులు, బహమనీ సుల్తానుల ఆధీనంలోనూ రాజమహేంద్రవరం కొంతకాలం ఉంది.
బ్రిటీష్ హయాంలోనూ గోదావరి జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం వెలుగొందింది. ఇలా... వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ నగరంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కవులు, కళాకారులు, సంఘ సంస్కర్తలకు నెలవు ఈ నగరం. కవిత్రయంలో ప్రథముడైన ఆదికవి నన్నయ ఇక్కడి వారే. సంఘ సంస్కర్త, ఆధునిక వైతాళికుడు కందుకూరి ఇక్కడి వారే. అయినా.. వారసత్వ నగరంగా గుర్తింపులో మాత్రం వెనకబడింది. ఈ నగర ప్రాశస్త్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు ప్రారంభించారు.
రాజమహేంద్రవరంలో రాళ్లబండి సుబ్బారావు పురావస్తుశాల, కందుకూరి నివాసం, దామెర్ల ఆర్ట్ గ్యాలరీ, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ నివాసం, కందుకూరి నిర్మించిన టౌన్‌హాలు, చిత్రాంగి అతిథి గృహం, తదితర చారిత్రక విశేషాలు ఈ నగరం సొంతం. ఈ నగర ప్రాముఖ్యతను, వారసత్వ సంపదను ఓ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రతయత్నాలు సాకారమైతే.. రాజమహేంద్రవరం రాష్ట్రానికి చారిత్రక, సాంస్కృతిక, ఆద్యాత్మికతోపాటు వారసత్వ నగరంగానూ ప్రత్యేకత చాటుకోనుంది.
ఇదీ చదవండి: