తూర్పుగోదావరి జిల్లాలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి చిక్కుముడి వీడటం లేదు. చట్టబద్ధమైన అనుమతులు వచ్చే వరకు నీటి విడుదలపై ఆంక్షలు విధించారు. జాతీయ హరిత ట్రెబ్యునల్ త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలతో ఎత్తిపోతల పథకం వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
సాగునీటి కల సాకారం చేస్తుందనుకున్న ప్రాజెక్టుపై నీలినీడలు అలముకున్నాయి. కీలక సమయంలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడాల్సిన నీటి వనరులు అందకుండా పోయాయి. సీతానగరం మండలంలో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మండలంలోని చినకొండేపూడి, రామచంద్రాపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి, నాగంపల్లి తదితర గ్రామాలకు చెందిన 80 మంది రైతులు తమకు పరిహారం సరిపోదని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..మరికొందరు జాతీయ హరిత త్రిసభ్య ధర్మాసనం (ఎన్జీటీ)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్జీటీ వాస్తవాల పరిశీలనకు ఫిబ్రవరి నెలలో కేంద్ర పర్యావరణ శాఖలోని పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) కమిటీ ఛైర్మన్ జైన్ నేతృత్వంలో వివిధ శాఖల నిపుణులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం, కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
జలకళ ఎప్పుడో..?
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదల ఏడాదిగా నిలిచిపోయింది. తాజాగా చిక్కుముడులు వీడితే తప్ప కదలిక వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టుకు 2017 జనవరి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిఠాపురంలో శంకుస్థాపన చేశారు. అదే ఏడాది ఈ ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అప్పట్లో రూ.1,638 కోట్లతో ఈ పథకాన్ని నిర్మించారు. తొలి దశలో భాగంగా పురుషోత్తపట్నంలో ఒక పంపు హౌస్..రెండో దశలో రామవరం వద్ద ఒక పంపు హౌస్‌ను ఏర్పాటు చేశారు.ఈ రెండు మోటార్ల ద్వారా 1.5 టీఎంసీల గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి విడిచిపెట్టారు. ఏలేశ్వరం, కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల పరిధిలో 67,174 ఎకరాలను ఏలేరు ఆయకట్టు స్థిరీకరణగా నిర్దేశించారు. మరోవైపు ఏలేరు ఆధునికీకరణ పనులు ఏడు మండలాల పరిధిలో రూ.264 కోట్లతో చేపట్టేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆధునికీకరణ పూర్తయితే 67,600 ఎకరాల భూములకు సాగునీరు అందే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయి ఆధునికీకరణ పనులు జరుగుతున్న క్రమంలో వివాదం తెరపైకి రావడం ఇబ్బందిగా మారింది. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే ఎత్తిపోతల పథకం పనులు చేపట్టారని ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు కాగా పోలవరం ప్రాజెక్టులో భాగంగానే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని, ప్రత్యేక అనుమతులు అవసరం లేదని విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీకి అప్పట్లో నివేదించిన విషయం తెలిసిందే.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం సమగ్ర పథక నివేదిక (డీపీఆర్)ను కేంద్ర జలసంఘం అనుమతించలేదని..ఇందుకు అవసరమైన నిధులు కూడా చెల్లించలేదని పేర్కొనడం గమనార్హం. తాజాగా చట్టపరమైన అనుమతులన్నీ తీసుకున్నంత వరకు నీటి విడుదల నిలుపుదల కొనసాగించాలని ఎన్జీటీ పేర్కొంది.మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న యంత్రాంగంలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి: ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన: 'పెద్దమ్మ'కు అండదండలు