'నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేననే భయం నన్ను వెంటాడుతోంది... తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నా'అంటూ తన అన్నయ్య చరవాణికి మెసేజ్ పంపిన ఆ విద్యార్థి అదృశ్యమయ్యాడు. చివరికి సముద్రంలో శవమై తేలాడు. ఎస్సై దీనబంధు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సందేశం పంపి... సముద్రంలోకి దూకి
తూర్పుగోదావరి జిల్లా తునిలోని గరువువీధికి చెందిన కె.మోహిత్‌కుమార్ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొవిడ్ కారణంగా కొన్నాళ్లు ఇంటి వద్దే ఉన్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో చదువుకోవడానికి వీలుగా ఉంటుందని నాగులచవితికి ముందు రోజు వసతిగృహంలో ఉండేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి శనివారం రాత్రి తుని వచ్చాడు. ఇంట్లో వారికి తెలియకుండా గ్రిల్స్‌లోంచి బ్యాగు, ఇతర వస్తువులు లోపల వేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకుని బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 సమయంలో అతని అన్నయ్య ఆదర్శకుమార్ చరవాణికి మోహిత్‌కుమార్ సంక్షిప్త సమాచారం పంపాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదవలేకపోతున్నాని, ద్విచక్రవాహనం పాల్మన్‌పేట తీరప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తీరప్రాంతానికి చేరుకున్నారు. రత్నాయంపేట సముద్రపు ఒడ్డున ఉన్న జెట్టీ పక్కన బైకు గుర్తించారు. యువకుడి ఆచూకీ లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎందుకిలా చేశావ్ మోహిత్
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో తొండంగి మండలం వాకదారిపేట వద్ద (సుమారు 11 కిలోమీటర్ల దూరంలో) సముద్రంలో మృతదేహం తేలి ఆడుతుందని మత్స్యకారుల ద్వారా సమచారం అందింది. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని తుని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కనీసం కడసారిచూపునకు నోచుకోని విధంగా అంబులెన్సులోనే మూటకట్టి ఉన్న శరీరానికి తల్లిదండ్రులు పూలమాలలు వేసి నివాళి అర్పించాల్సిన పరిస్థితి రావటంతో అక్కడి వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. నీకేం కావాలన్నా ఇచ్చాం కదా మోహిత్...ఎందుకిలా చేశావ్ అంటూ మోహిత్ కుమార్ తల్లి రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. పట్టణంలోని గరువువీధిలో ఉన్న మోహిత్ నివాసం నుంచి బంధుమిత్రులు శ్మశానవాటికకు అంతిమయాత్ర నిర్వహించి కడసారి వీడ్కోలు పలికారు.
ఇదీ చదవండి