గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు మాజీ ఎంపీ, వైకాపా నేత పండుల రవీంద్రబాబు.. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో అనేక హామీలు ఇస్తుంటారని..అధికారంలోకి రాగానే వాటిని విస్మరిస్తుంటారని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన అన్నారు. కానీ సీఎం జగన్ అందుకు భిన్నమన్నారు. మాట తప్పరు... మడమ తిప్పరు అని మరోసారి రుజువు చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలు....అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమలు చేశారని రవీంద్రబాబు అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబాజీపేట వచ్చినప్పుడు.. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని తెలిపారు. దళిత, గిరిజన, బలహీనవర్గాలకు ఒక అన్నగా సీఎం జగన్ నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలకు ఓ దిక్కు దొరికిందన్నారు.
ఇదీ చదవండి : పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు