తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో.. బ్రిటీష్ హయాంలో నిర్మించిన భవంతిలో అర్బన్ తహసీల్దార్, సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. 110 ఏళ్ల క్రితం.. ఈ భవంతిని నిర్మించారు. పురాతనమైన ఈ భవనం జీవిత కాలం పూర్తైందని.. దీనిని కూలగొట్టాలని ఆర్అండ్బీ అధికారులు పదేళ్ల క్రితమే తేల్చారు. కొత్త భవనాల కోసం తరచూ ప్రతిపాదనలు పంపిస్తున్నా..మోక్షం లభించ లేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కార్యాలయ ప్రాంగణం మునిగింది. కార్యాలయానికి వెళ్లాలంటే నీళ్లలో సర్కస్ ఫీట్లు చేయాల్సి పరిస్థితి. పైకప్పు నుంచి వర్షపు నీరు కార్యాలయంలోనికి చేరడంతో.. కీలకమైన ఫైళ్లు తడిచి పోయాయి. ఈ కార్యాలయాలకు ఆనుకొని మేజర్ డ్రైయిన్ నిర్మాణం చేపట్టారు. ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి. నీరు పోయే మార్గం లేక అక్కడే నిలిచిపోతోంది. సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు మురుగు నీటిలోనే అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ ప్రాంగణంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల సరఫరా అధికారులు పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇది పూర్తిగా ధ్వంసమైంది. అయినా కార్యకలాపాలు సాగిస్తున్నారు. సబ్‌ట్రెజరీ కార్యాలయంలోనూ పైకప్పు నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బంది భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు.
కూలడానికి సిద్ధంగా ఉన్న పురాతన భవంతిలోనే రెవెన్యూ కార్యాలయం కొనసాగించడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: Departmental Exams: సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు.. నోటిఫికేషన్ జారీ