మనసు బాధపడితే ఈ లోకంలో ముందుగా గుర్తుకొచ్చేది కన్నతల్లే.. కష్టాన్ని ఆమెకు చెప్పుకొంటే గుండెల్లో భారమంతా తొలగిపోయి ఎంతో ఊరట.. ఏదైనా గాయమైతే అప్రయత్నంగా అమ్మా.. అంటూ ఆర్తనాదం చేస్తాం.. అభశుభం తెలియని ఆ చిన్నారులు కూడా అలాగే నమ్మారు.. మా అమ్మకు మేమంటే ఎంత ప్రేమో అనుకున్నారు..! ఆమె దండిస్తుంటే.. తాము ఏదైనా తప్పు చేశామేమోనని అనుకున్నారు.. ఆకలిగా ఉందమ్మా.. అని అడిగితే గోరుముద్దలు పెడుతుందని అనుకున్నారు గానీ..! అందులో విషం ఉందని ఊహించలేకపోయారు ఆ చిన్నారులు.. తల్లి పెట్టిన విషాహారం తినడంతో ఇద్దరు పిల్లలు ప్రాణాలు విడిచిన హృదయవిదారక ఘటన రాజమహేంద్రవరంలో ఆదివారం కలకలం రేపింది.
మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ కన్నబిడ్డలకు విషమిచ్చిన ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన కె.లక్ష్మీఅనూషకు తాడేపల్లిగూడేనికి చెందిన రాముతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయిదేళ్ల క్రితం రాము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆమెకు పోలవరానికి చెందిన రామకృష్ణతో రెండో వివాహం చేశారు. వివిధ కారణాలతో భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.
లక్ష్మీఅనూష తన ఇద్దరు పిల్లలతో కలిసి రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేటలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఒంటరి జీవితం అనుభవిస్తున్న ఆమె మానసికంగా బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారనే ఆలోచనతో కుమార్తె చిన్మయి(8), కుమారుడు మోహిత్‌శ్రీసత్య(6)లను చంపాలని నిర్ణయించుకుంది. పిల్లలిద్దరికీ ఆదివారం రాత్రి ఆహారంలో విషం కలిపి పెట్టింది. పిల్లల అమ్మమ్మ విషయం గమనించి రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకుకెళ్లగా అప్పటికే చిన్నారులిద్దరూ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై లక్ష్మీఅనూష చెబుతున్న పొంతనలేని సమాధానాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: groom suicide: 'కొత్తగా పెళ్లైనా రోజుకు 18 గంటల పని.. మూడు నెలల జీతం ఆపేసి'