లాక్డౌన్ కారణంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం పై తీవ్ర ఆర్థిక భారం పడింది. సుమారు రెండు నెలలుగా ఆలయానికి భక్తులు రాక పోవడంతో 20 నుంచి 25 కోట్లు రూపాయల వరకు ఆదాయం కోల్పోయింది. దీంతో ఆదాయం వచ్చేలా ప్రణాళిక చేయడంతో పాటు వ్యయం తగ్గించడం పై అధికారులు దృష్టి సారించారు.
అన్నవరం దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు రావడంతో కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 123 కోట్లు రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 135 కోట్ల రూపాయలకు పైగా వార్షిక బడ్జెటును అధికారులు సిద్ధం చేశారు. ఇందులో సుమారు 31 కోట్ల రూపాయల వరకు ఉద్యోగుల జీతభత్యాలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయం గణనీయంగా తగ్గే పరిస్థితుల్లో ఉద్యోగుల జీతభత్యాలతో పాటు, పలు అభివృద్ధి పనులపై కూడా పడింది. వివాహ ముహూర్తాలు, స్వామి వారి కల్యాణ మహోత్సవాలు, వేసవి సెలవుల సమయంతో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆదాయం అధికంగా వచ్చే అవకాశం ఉండగా ఈ సమయంలో లాక్డౌన్ విధించటంతో తీవ్ర ఆర్థిక నష్టం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 30 శాతం ఆదాయం తగ్గే అవకాశం ఉన్నట్లు అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావు వెల్లడించారు.
అనుమతిస్తే... ఏర్పాట్లకు సిద్ధం
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలతో అధికారులు ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సామాజిక దూరం ఉండేలా, శానిటైజింగ్తో పాటు, ప్యాకెట్లలలో అన్న ప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: సత్యదేవుని సన్నిధిలో వందల వివాహాలకు.. 'లాక్డౌన్'!