Illegal Digging Hills in East Godavari: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం సమీపంలో 108 సర్వే నంబర్‌లో ఉన్న కొండ భాగంలో మట్టి నిల్వలు దండిగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తవ్వి తరలించేస్తున్నారు. ఓ నాయకుడికి చెందిన పొలాన్ని లే అవుట్‌గా మార్చేందుకు మట్టి తరలిస్తున్నారని అందుకే అడ్డగోలు తవ్వకాల వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన సుద్ద అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు విచారణ జరిపారు. అక్రమాల నిగ్గు తేల్చి కోటీ 27 లక్షల అపరాధ రుసుం విధించారు. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న భూమిలో తవ్వకాలు సాగడం వివాస్పదంగా మారింది.
రామవరం(ramavaram)లోని 108 సర్వే నెంబరులో 65 ఎకరాల భూమి ఉంది. అందులో 55 ఎకరాలు రైతుల సాగులో ఉండగా మిగిలిన 10 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ఈ భూమిని రాజకీయ అండతో కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. పామాయిల్ తోటల పక్కనున్న కొండను తవ్వి ఆక్రమించే చర్యలు ఊపందుకున్నాయని రైతు సంఘాలు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే 10 ఎకరాల్లో మట్టి తవ్వకాలకు తెరలేపారని ఆక్షేపిస్తున్నారు.
రామవరంలోని సర్వే నెంబర్ 108లో ఉన్న 65 ఎకరాల భూమి.... జిరాయితీ భూమేనని... పోరంబోకు భూమి కాదని జగ్గంపేట తహసీల్దారు సరస్వతి చెబుతున్నారు. 18.63ఎకరాల భూమిలో మట్టి తవ్వకాలకు సంబంధించి భూపతి రాజ్యలక్ష్మి పేరిట దరఖాస్తు అందినట్లు తెలిపారు. అయితే మట్టి తవ్వకాలకు సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తులు అందలేదని రాజమహేంద్రవరంలోని మైనింగ్ ఏడీ కార్యాలయ అధికారులు తెలిపారు.
కొండ మట్టి తవ్వుతున్న ప్రాంతంలో కీలకమైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల స్టేజ్-2 పైపు లైను ఉంది. దీని మీదుగా నిరంతరం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో పైపులైను దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు పట్టించకోవడంలేదన్నారు.
ఇదీ చదవండి: Central Team At Kadapa: కడప జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన.. వరద తీవ్రతపై పరిశీలన