18,795 హెక్టార్లలో వరిపై ప్రభావం
తూర్పుగోదావరి జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ఆదివారం ప్రాథమిక సర్వే నిర్వహించారు. జిల్లాలో 9,337 హెక్టార్లలో వరి పంట నేలవాలింది. 1,378 హెక్టార్లలో పనులపై ఉన్న చేను, కుప్పలపై ఉన్న 883 హెక్టార్లలో, 7,191 హెక్టార్లలోని ధాన్యం కళ్లాల్లో తడిసింది. జిల్లాలో 18,795 హెక్టార్లలో వరి పంటకు ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్లు జేడీఏ కేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. 27, 28, 29 తేదీల్లో వర్ష సూచన ఉందని, రైతులు ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవాలని సూచించారు. కిర్లంపూడి, పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, కడియం, మండపేట, అనపర్తి మండలాల్లో 41 హెక్టార్లలో అరటికి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఉద్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్ తెలిపారు.
పలు ప్రాంతాల పరిస్థితి ఇదీ..
పిఠాపురం, గొల్లప్రోలు
పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పొలాల్లో ఉండిపోయిన వరిపనలు, ధాన్యం తడిసిముద్దయ్యాయి. బి.కొత్తూరు, మంగితుర్తి, జములపల్లి, గోకివాడ, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది.
అయినవిల్లి
నేదునూరు, అయినవిల్లి, విలస, సిరిపల్లి గ్రామాల్లో వరిపనలు దెబ్బతిన్నాయి..
పెద్దాపురం
పెద్దాపురం పట్టణం, మండలంలో వర్షానికి 10 శాతం వరి పంటకు నష్టం వాటిల్లిందని ఏవో ద్వారకాదేవి తెలిపారు.
మండపేట
సుమారు 600 హెక్టార్లలకు సంబంధించి ఆరబోసి బరకాలు వేసిన ధాన్యం 10 శాతం మేర తడిసినట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
కిర్లంపూడి
కిర్లంపూడి మండలంలోని గ్రామాల్లో వందలాది ఎకరాల్లో కోసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆదివారం రైతులు ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకొచ్చి ఆరబెట్టారు. కిర్లంపూడి, ముక్కొల్లు, రాజుపాలెం, రామకృష్ణాపురం, చిల్లంగి, వీరవరం, గోనేడ, గెద్దనాపల్లి తదితర గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉంది. వేలంకం, ముక్కొల్లు, వీరవరం తదితర గ్రామాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.
కిర్లంపూడిలో అధిక వర్షపాతం
కాకినాడ కలెక్టరేట్: జిల్లాలోని 55 మండలాల్లో శనివారం వర్షం కురిసింది. అత్యధికంగా కిర్లంపూడి మండలంలో 16.60 సెం.మీ, రామచంద్రపురం మండలంలో అత్యల్పంగా 0.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. గొల్లప్రోలు మండలంలో 11.90 సెం.మీ., ప్రత్తిపాడులో 9.60, ముమ్మిడివరంలో 9.92, యు.కొత్తపల్లిలో 7.28, పిఠాపురంలో 7.04, ఏలేశ్వరంలో 6.42, అడ్డతీగలలో 6.22, గంగవరంలో 5.50, మారేడుమిల్లిలో 5.36, ఐ.పోలవరంలో 5.06, రంపచోడవరంలో 4.66, రాయవరంలో 4.32 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఇదీ చదవండి :