కాకినాడలో 3 రోజుల క్రితం అపహరణకు గురైన దీప్తిశ్రీ... దారుణ హత్యకు గురైంది. ఆ చిన్నారి మృతదేహం.. ఇంద్రపాలెం లాకుల దిగువన డ్రెయిన్‌లో బయటపడింది. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన బాలిక దీప్తిశ్రీ.. విగతజీవిగా కనిపించడం.. బాధిత కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టింది.
దీప్తిశ్రీ ఆచూకీ కోసం 3 రోజులుగా పోలీసులు విస్తృతంగా శోధించారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం.. పినతల్లి హత్య చేసి ఉంటుందని అనుమానించారు. ఉప్పుటేరులో ధర్మాడి సత్యం బృందంతో... రెండ్రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.
సీసీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా..
మూడ్రోజుల క్రితం దీప్తిశ్రీని సవతితల్లి శాంతకుమారి తీసుకొస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గోనెసంచి మూటను వంతెనపై పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. వాటి ఆధారంగానే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంద్రపాలెం లాకులు, ఉప్పుటేరు వద్ద విస్తృతంగా గాలించారు. కాకినాడ నగరం సహా గ్రామీణ మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు జాగిలాలతో వెతికారు.
మూడేళ్ల క్రితం తల్లి.. ఇప్పుడు చిన్నారి
జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో దీప్తిశ్రీ రెండో తరగతి చదువుతోంది. తల్లి మూడేళ్ల క్రితమే చనిపోగా, తూరంగి పగడాల పేటలో బంధువుల ఇంట్లో బాలిక ఉండేది. మరో వివాహం చేసుకున్న తండ్రి శ్యాం ప్రసాద్.. భార్య శాంతి కుమారి, కుమారుడితో కలిసి సంజయ్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. రోజూలానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన దీప్తిశ్రీ... మధ్యాహ్న భోజనం తర్వాత బడి ఆవరణలో ఆడుకుంది. ఆ సమయంలోనే సవతితల్లి ఆమెను ఎత్తుకువెళ్లింది. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సవతి తల్లి శాంతి కుమారిని అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది.
ఇదీ చదవండి