తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద గ్యాస్ నిక్షేపాలను వెలికితీస్తున్నారు. పదేళ్ల కిందట ఓఎన్జీసీ ఉప్పూడిలోని గంటివారిపేట వద్ద బావి తవ్వింది. ఇందులో ప్రెజర్ గ్యాస్ నిక్షేపాలున్నట్లు గుర్తించి.. దానిని డ్రిల్లింగ్ పూర్తి చేసి.. సీల్ వేశారు. అనంతరం బావిని ప్రభుత్వానికి అప్పగించారు. తర్వాత అధికారులు పీహెఫ్ హెచ్ సంస్థకు అధికారులు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బంది బావి వద్ద పనులు చేస్తుండగా...ఒక్కసారిగా పెద్దశబ్దంతో గ్యాస్ లీకైంది. క్షణాల్లోనే పరిసర ప్రాంతాల చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన ఉప్పూడి గ్రామస్థులతోపాటు.. సమీపంలోని గంటివారిపేట, నాగిచెరువు గ్రామాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు తక్షణం అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ బావికి 2 కిలోమీటర్ల మీటర్ల పరిధిలోని అందర్నీ ఖాళీ చేయించి దూరప్రాంతాలకు తరలించారు.
పెద్దఎత్తున ఎగజిమ్ముతున్న గ్యాస్ ను అదుపుచేయడం అధికారులు, సిబ్బందికి కష్టతరమైంది. చీకటిపడటంతో మరమ్మతు పనులు నిలిపేశారు. ఘటనాస్థలాన్ని కలెక్టర్, ఎస్పీతోపాటు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ పరిశీలించారు. ఉప్పూడి గ్రామస్థులకు చెయ్యేరులోని పాఠశాలలో శిబిరం ఏర్పాటు చేశారు. గ్యాస్ బావులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి