తూర్పు గోదావరి జిల్లా మన్యం వాసులను వరద బెంగ వీడలేదు. ఇటీవలి వర్షాలకు వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో తంటికొండ పంచాయతీ గింజర్తి, ఎర్రంపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలంలో దాకరాయి శివారున నర్సీపట్నం- ఏలేశ్వరం ప్రధాన రహదారిపై బుధవారం భారీ వృక్షం నేలకొరిగింది. గంటన్నరపాటు రవాణా స్తంభించింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. పోశమ్మగండి నుంచి మంటూరు వరకూ గ్రామాలన్నీ ముంపులోనే ఉన్నాయి. పూడిపల్లి, పోశమ్మగండి, దేవీపట్నం, తొయ్యేరుల్లో ఇళ్లు నీట మునిగాయి. పి.గొందూరు గ్రామ శివారులోని నిర్వాసితులు బికుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలు గ్రామాల్లో పాత ఇళ్లు కూలిపోయాయి. సీతపల్లి వాగు ఉప్పొంగి.. దండంగి- చినరమణయ్యపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. వరద ఇంకా పెరిగితే కొండమొదలు పంచాయతీలోని 11 గ్రామాల గిరిజనులు కొండలపైకి చేరుకోకతప్పదు.
‘ఈనాడు’ కథనానికి స్పందన
వరరామచంద్రపురం మండలంలోని అన్నవరం వాగు పైనుంచి రాకపోకలకు ఆర్‌అండ్‌బీ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘జలార్పణం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించి రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. వంతెన పక్కన ఏర్పడిన గుంతను మట్టితో పూడ్చారు. 20 గ్రామాల ప్రజలకు దారి అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: Protest: వినాయక ఉత్సవాలకు అనుమతివ్వాలంటూ పూజారుల ధర్నా