ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదికి వరద పోటెత్తటంతో పోలవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల ద్వారా 8.60 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. వరద కారణంగా.. పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే 12 గ్రామాల్లోకి నీరు చేరింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం అన్నంపల్లి వద్ద గౌతమీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాఘవేంద్ర వారధి, సమీప లంక భూములు ముంపునకు గురయ్యాయి. అధికారులు లంకగ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.