పుదుచ్చేరి అసెంబ్లీకి ఉన్న 30 స్థానాలకు గత నెల 6 న జరిగిన ఎన్నికల ఫలితాలు.. ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అక్కడి అధికారులు పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.. అక్కడి పౌరసేవా కార్యాలయం సమావేశ మందిరంలో జరగనుంది.
ఓట్ల లెక్కింపు జరిగేదిలా..
ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. 7 గంటల 30 నిమిషాలకు అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాల్సి ఉంటుంది. మొత్తం 60 పోలింగ్ కేంద్రాల్లో కంట్రోల్ యూనిట్లను ర్యాండమైజేషన్ ద్వారా వచ్చిన మొదటి నాలుగింటిని నాలుగు టేబుళ్ల వద్దకు తీసుకువచ్చి లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇలా మొత్తం 15 రౌండ్లలో 60 కేంద్రాల వివరాలు వెల్లడి కావడానికి మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టనుంది. ఇప్పటికే అభ్యర్థులు, ఏజెంట్లకు పాసులు జారీ చేసినట్లు రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నాయకలు, కార్యకర్తలు ఒకే చోట గుమిగూడి ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గెలుపుపై ధీమా..
యానాం అసెంబ్లీ స్థానానికి 15 మంది పోటీలో ఉండగా భాజపా, అన్నాడీఎంకే మద్దతుతో.. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగస్వామి.. ఇండిపెండెంట్గా మొదటిసారి రాజకీయ ప్రవేశం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ మధ్యే పోటీ సాగింది. 1996 నుంచి 25 సంవత్సరాలుగా యానం శాసనసభ్యుడిగా కొనసాగుతూ వచ్చిన మల్లాడి కృష్ణారావు ఎన్నికల ముందు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి యానాం నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు ఖాయమే అయినా ఎంత ఆధిక్యం వస్తుందన్నవిషయంపైనే ఆసక్తి అని అనుచరులు అంటున్నారు.
నమోదైన ఓట్లు.. 34, 390
యానాం నియోజవర్గంలో మొత్తం 37,811 మంది ఓటర్లుండగా.. వారిలో స్త్రీలు- 19,523, పురుషులు- 18,288 మంది ఉన్నారు. వీరి కోసం 60 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల జరిగిన ఎన్నికల్లో 34,390 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో స్త్రీలు-17,626, పురుషులు-16 764 మంది ఉన్నారు. సుమారు మూడు వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
ఇవీ చదవండి: