కరోనా కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటకం ఇన్నాళ్లుగా నిలిచిపోయింది. లాక్ డౌన్ ప్రారంభంలో గోదావరి తీరంలోని పర్యాటక బోటు షికారుతోపాటు అటవీశాఖ పరిధిలోని కోరింగ అభయారణ్యం సందర్శన మూసేశారు. అలాగే.. మన్యంలోని మారేడుమిల్లి పర్యటన, రాజమహేంద్రవరంలోని నగర వనం సందర్శన నిలిపేశారు. జిల్లాలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన సానుకూల పరిస్థితుల్లో.. ఎకో టూరిజానికి అటవీశాఖ అనుమతులిచ్చింది. కోరింగ మడ అడవుల అందాల సందర్శనకు పర్యాటకులకు అవకాశం కల్పించింది.
మడ అడవుల్లో బోటు షికారుకు త్వరలోనే అనుమతులివ్వనున్నారు. రాజమహేంద్రవరంలోని నగరవనం, మారేడుమిల్లిలోని జంగల్ స్టార్, వనవిహార్ ఉద్యానవనాలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సందర్శకులకు అటవీశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా ముప్పు పూర్తిగా తొలగని ప్రస్తుత పరిస్థితుల్లో.. సందర్శకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: