తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు.. దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 25 వర్ధంతి రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు రక్తదానం చేశారు. వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్రజల పక్షాన తెదేపా పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- అమలాపురంలో..
దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అమలాపురంలో మాజీ శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు.. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- పి.గన్నవరంలో..
పి.గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం దివంగత నేత ఎన్టీఆర్కు నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన అభివృద్ధి పనులను నేతలు స్మరించుకున్నారు.
- అనపర్తిలో..
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నందమూరి తారకరామారావే ఆద్యుడని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కొనియాడారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పలు గ్రామల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
ఇదీ చదవండి: సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్: చంద్రబాబు