తూర్పుగోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్లో.. ఐదేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కేసు చిక్కుముడి వీడడం లేదు. చిన్నారి ఆచూకీపై తల్లిదండ్రులు, కుటుంబీకుల్లో ఆందోళన పెరుగుతోంది. పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ పరామర్శించారు. ఘటనపై మరోసారి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు.. తమ ఆవేదనను వారికి వ్యక్తం చేశారు. త్వరగా.. క్షేమంగా.. తమ బాలుడిని కాపాడాలని వేడుకున్నారు.
17 బృందాలతో దర్యాప్తు: ఎస్పీ అస్మీ
బాలుడి అపహరణ కేసును.. 17 బృందాలతో విస్తృతంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ అస్మీ చెప్పారు. బాధిత కుటుంబం నుంచి అన్ని వివరాలు తీసుకున్నామని.. కుటుంబ కక్షల కోణం ఈ ఘటన వెనక లేదని చెప్పారు. ప్రొఫెషనల్ కిడ్నాపర్లు ఈ పని చేసినట్టు అనుమానిస్తున్నామన్న ఎస్పీ.. గతంలో జరిగిన కొన్ని కేసుల వివరాలనూ పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకూ బెదిరింపు కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగా బాలుడి ఆచూకీ తెలుసుకుంటామన్నారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు డీజీపీకి చేరవేస్తున్నామని చెప్పారు.