YCP OFFICE: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం స్థలంలో క్రమేపీ ప్రభుత్వ, ప్రైవేటు అవసరాలకు గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపులు జరిగిపోతున్నాయి. ఈ జైలు స్థలం మొత్తం 170 ఎకరాలు. ఇందులో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య కళాశాల కోసం దాదాపు 13 ఎకరాలను తీసుకుంది. తాజాగా అదే జైలు స్థలంలో మరో 2 ఎకరాలు తూర్పుగోదావరి జిల్లా వైకాపా కార్యాలయం కోసం కేటాయించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అర్బన్ తహసీల్దార్ ద్వారా ప్రతిపాదనలు పెట్టారు. దీనిపై ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పైకి లీజు చెల్లించి వినియోగించుకుంటామని చెబుతున్నా... శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నందున క్రమంగా పార్టీ ఆ స్థలాన్ని సొంతం చేసుకుంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వైద్య కళాశాల కోసం తీసుకున్న స్థలంలో డీఐజీ కార్యాలయం, వసతి గృహాలు ఉన్నాయి. ఇప్పుడు వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రతిపాదించడం గమనార్హం.
ఇవీ చదవండి: