ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్ల ను శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీ దేవి రూపంలో అలంకరించి తెల్లవారుజామున 5 గంటల నుంచి అర్చకులు పూజలు చేశారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రధానాలయం మూలవిరాట్ పక్కనే వేదికను ఏర్పాటు చేసి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆశీనులను చేశారు. భక్తులు మూల విరాట్ ను దర్శించుకుంటూ ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్ల ను దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కొలువైన ప్రముఖ దేవాలయం అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ స్వామిని ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నారు. లంకలగన్నవరం పోతవరం అంబాజీపేట నల్లచెరువు గ్రామాలలో కొలువైన కలియుగ వెంకటేశ్వర స్వామిని భక్తులు వైకుంఠ ద్వారం లో వెళ్లి దర్శనం చేసుకున్నారు.
కుటుంబ సమేతంగా హజరైన ఎమ్మేల్యే జగ్గిరెడ్డి
ముక్కోటి ఏకాదశి ఈ సందర్భంగా కోనసీమ తిరుపతి అయిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబసమేతంగా హాజరై ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న తెదేపా నేత జ్యోతుల నెహ్రూ
గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామం లో జీయ్యన్న స్వామి మఠం లో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మూల ద్వార దర్శనం ఏర్పాటు చేశారు..... తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మూల ద్వారం ద్వారా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు..... జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ దంపతులు మూల ద్వారం ద్వార స్వామి వారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇదీ చదవండి: సత్యదేవుని దర్శనానికి 'ధర్మాన కుటుంబం'