Side effects of strong tea : 'ఛాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్' అంటారు మెగాస్టార్ చిరంజీవి. 'హే సక్కుబాయ్ జర దేదోనా గరమ్ గరమ్ చాయ్' అని ఛార్మిని టీ తెమ్మని అడుగుతారు అక్కినేని నాగార్జున. ఇవన్నీ చాయ్ గొప్పతనాన్ని, అవసరాన్ని, ఆ సందర్భాన్ని వివరించే సినిమా పాటలు. గరీబు నుంచి నవాబు దాకా చాయ్ అనేది బంధువని సినీ రచయితలు విశ్లేషించారు. చాయ్‌లో ఎన్నో రకాలున్నాయి. అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ, మలాయ్ చాయ్, ఇరానీ చాయ్ ఇలా పేర్లు చెప్పుకొంటూ పోతే వందల రకాల టీ రకాలున్నాయి. వైజాగ్ లోని జగదాంబ సెంటర్లో ఉన్న ఒకే దుకాణంలో వంద రకాల టీలు అందిస్తారని తెలుసా?
ఇంట్లో అయినా, హోటల్‌కి వెళ్లినా "స్ట్రాంగ్ టీ" అడగడం మనకు అలవాటు. అయితే, స్ట్రాంగ్ టీ అంటే అర్థం ఏంటి? పాలు ఎక్కువా? డికాక్షన్ ఎక్కువా? లేక పంచదార ఎక్కువా? అవేమీ కాదు బాగా మరిగించిన దానిని స్ట్రాంగ్ టీ అంటారనేదే మీ సమాధానం అయితే ఒక్క సారి ఆలోచించుకోవాల్సిందే. చిక్కటి పాలు, రుచికి సరిపడా పంచదార, రంగు తేలే డికాక్షన్ కలిపి బాగా మరిగించితే స్ట్రాంగ్ టీ అంటారనుకుంటే దాని వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తరచూ స్ట్రాంగ్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే స్ట్రాంగ్ టీపై ఓ లుక్కేద్దాం పదండి.
మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!
అసలు సిసలైన టీ అభిమానులు బెడ్ మీద నుంచి లేచింది మొదలు తిరిగి రాత్రి బెడ్ పైకి చేరే వరకు దాదాపు పది సార్లు సేవిస్తారంట. ఉత్సాహం కోసం ఉదయం లేవగానే, విధుల్లో నిస్సత్తువ తొలగించుకోవడానికి మధ్యాహ్నం, అలసట సాకుతో సాయంత్రం ఇలా ఒక్కో కారణం చెబుతూ టీ అలవాటు పడతారు. ముఖ్యంగా స్ట్రాంగ్ టీ కావాలంటూ అడిగేవారిని మనం చూస్తుంటాం. స్ట్రాంగ్ అనిపించేలా టీని ఎక్కువసేపు మరిగిస్తారు. టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. టీలోని కెఫిన్ గంభీరంగా ఉండటానికి బదులుగా ప్రశాంతంగా ఉంచుతుందట. దృష్టి, ఏకాగ్రత పెరుగుతుందట. హృదయానికి మంచిదని, జీవక్రియ పెరుగుతుందని, క్యాన్సర్‌ను అరికట్టడంలో సహాయపడుతుందని విన్నాం కానీ, అదే పనిగా టీని ఎక్కువ సేపు మరిగించడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.
అధికంగా మరిగించి తయారు చేసే టీ తాగడం వల్ల కలిగే నష్టాలపై National library of medicine ఓ పరిశోధన కథనాన్ని పబ్లిష్ చేసింది. పాలను అధికంగా మరిగించడం వల్ల కాలేయం పనితీరు మందగించడంతో పాటు గుండెపై చెడు ప్రభావం పడుతుంది. టీ ఎక్కువ సేపు మరిగించినా, పదే పదే వేడి చేసి తాగినా టానిన్లు అధికంగా విడుదలై రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైబీపీ ఉన్న వారు స్ట్రాంగ్ టీ అని అడగడం మానుకోవడం మంచిది. టీలో ఉండే టానిన్లు పోషకాలను, ఇనుము, కాల్షియం ఖనిజాల శోషణను అడ్డుకుంటాయి. అంతే కాదు టీ నేరుగా ఎముకలు, దంతాల సమస్యలకు దారితీస్తుంది. స్ట్రాంగ్ టీ అధికంగా తాగడం వల్ల రక్తహీనత లోపం కనిపిస్తుంది. పాలతో తయారు చేసే చాయ్ ఎంత ఎక్కువగా మరిగిస్తే అది జీర్ణం కావడం మన శరీరం అంత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందట. దీంతో ఎసిడిటీ సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలకు తోడు కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, కడుపులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్‌తో సూపర్ టేస్ట్
ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!