తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో రెండేళ్లకోసారి సత్తెమ్మతల్లి అమ్మవారి జాతర.. వైభవంగా జరుగుతుంది. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన సంప్రదాయాలు.. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నవారైనా.. ఈ జాతరలో భిక్షగాళ్లుగా మారిపోతారు. విదేశాల్లో పెద్ద చదువులు చదివిన వారైనా సరే.. పాములు పట్టేవారిగా కనిపిస్తారు. కొందరు దేవతల అవతారం.. మరికొందరు రాక్షసుల అవతారం ఎత్తుతారు. అమ్మవారికి మొక్కడం.. కోరిక నెరవేరిన తర్వాత ఇలా నచ్చిన వేషం వేసి ప్రత్యేక పూజలు చేయడం.. ఈ జాతరలో ఆనవాయితీగా, సంప్రదాయంగా వస్తోంది.
వేడుకల్లో భాగంగా.. మొదటి రోజు కత్తెరకుండను మిద్దెపై నుంచి కిందకు దించే ప్రక్రియతో జాతర ప్రారంభమవుతుంది. రెండవ రోజు గ్రామానికి చెందిన ఆడపడుచులు, బంధువులు.. ఏ ప్రాంతంలో ఉన్నా ఇళ్లకు చేరుకుంటారు. వివిధ వేషాలు ధరించి ఆలయం వద్దకు చేరుకుంటారు. గుడిలోకి పూజారిని ప్రవేశించకుండా అడ్డుపడతారు. కోపోద్రిక్తుడైన పూజారి భక్తులకు బడితపూజ చేస్తారు. ఈ సమయంలో పూజారితో దెబ్బలు తినేందుకు భక్తులు పోటీపడతారు.మూడో రోజు గ్రామమంతా సందడి వాతావరణం కనిపిస్తుంది. కోటీశ్వరులైనా, సామాన్యులైనా వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకుంటారు. కోర్కెలు తీరిన భక్తులు ఏదో ఒక వేషం వేసి గ్రామ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తారు. ఇలా వచ్చిన డబ్బు, బియ్యాన్ని ఆలయానికి సమర్పిస్తారు. ఆ సొమ్ముతో భక్తులకు అన్నదానం చేస్తారు.ఈసారీ సంప్రదాయాన్ని కొనసాగించిన గ్రామస్థులు... జాతరను ఘనంగా నిర్వహించారు. సోమవారంతో ముగిసిన వేడుకల్లో.. ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు. అమ్మవారికి తమ ఆచారం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: అనగనగా ఓ చేప... దాని కడుపులో 9 పిల్లలు..!