ఎన్ఆర్ఈజీఎస్ పనులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీడీవోలకు సూచించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వర్తక సంఘ కల్యాణ మండలపంలో కరోనా వైరస్ వ్యాప్తిపై నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 4 మండలాల తహసీల్దార్లు రేషన్ పంపిణీలో తలెత్తే సమస్యలు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో ఉన్న ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఉమ ముఖ్యమంత్రి చంద్రబోస్ మాట్లాడుతూ జిల్లాలో 5 వేల ఐసోలేషన్ బెడ్లు, 15 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం చేయాలని కేంద్రం సూచించినట్లు తెలిపారు. దీని బట్టి మనం సురక్షితంగా లేమని ప్రజలు అర్ధం చేసుకోవాలనీ మంత్రి అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వారపు సంతలు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో, వీధుల్లో కూరగాయలు, పండ్లు అమ్ముకోవటానికి వర్తకులకు మధ్యాహ్నాం ఒంటిగంట వరకు అనుమతి ఇవ్వాలన్నారు.
నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో ప్రభుత్వం ఏ విధమైన ఆటంకం కలిగించటం లేదని స్పష్టం చేశారు. నిత్యావసర సరుకుల సరఫరా లారీలకు బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లారీలో డ్రైవరు, క్లీనరు తప్ప వేరెవ్వరు ఉండకూడదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఆందోళన వద్దు... అందరికీ రేషన్ ఇస్తాం'