CM Jagan visited East Godavari district తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఎమ్మెల్యే .. తమ్ముడి వివాహ రిసెప్షన్. ఆ ప్రాంతంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ను ఆపేశారు. ఏంటీ ఎమ్మెల్యే తమ్ముడి వివాహం.. అది కూడా రిసెప్షన్ కార్యక్రమానికే, ఇంత హంగామానా.. అని అనుకుంటారా..! అంతే మరీ..ఆ వివాహానికి సీఎం జగన్ వస్తున్నారంటే.. ఆ మాత్రం హడావిడి అవసరమే కదా. ఇప్పుడ విషయం బోదపడింది కదా.. ! ఇవాళ సీఎం జగన్ రాకతో, ఆ ప్రాంతంలోని ప్రజలకు చుక్కలు కనిపించాయి. అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. మొత్తానికి సీఎం జగన్ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్లే వరకు.. రోడ్డుపై ప్రయాణికులు నకరం తప్పలేదు.
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి హెలికాప్టర్లో దివాన్ చెరువు చేరుకున్న జగన్ కొద్దిసేపు వైసీపీ నాయకులతో మాట మంతీ చేశారు. అనంతరం వేదిక పైన యువజన నాయకుడు జక్కంపూడి గణేష్ సుకీర్తి దంపతుల్ని ఆశీర్వదించారు. సుమారు 20 నిమిషాల సేపు వేదికపై గడిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై లారీల రాకపోకలు మూడు గంటలపైగా నిలిపి వేయడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి అధికార పర్యటనలైనా... పార్టీ కోసం చేసే పర్యటనలైనా సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Jagan Yemmiganur Tour Arrangements: సీఎం పర్యటన అంటేనే.. హడలిపోతున్న ప్రజలు
అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు: సీఎం జగన్ ఈ వివాహా పర్యటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరైతే.. ఇంత పగడ్బంది భద్రత ఏంటని.. స్థానికులు ముక్కున వేలు వేసుకున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి.. స్థానికులను ఇబ్బంది పెట్టడం ఏంటని వాపోయారు. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. సీఎం హాజరయ్యే కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలను తీసుకెళ్ళేందుకు ఆయా పాఠశాల బస్సులను తీసుకున్నారు. దీంతో విద్యార్థులు స్కూల్ కు వెళ్లేందుకు బస్సులు లేకుండా పోయాయి. దీంతో పాఠశాలలకు ఐచ్చిక సెలవును ప్రకటించినట్లు సంబంధిత డీఈఓ , పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజమండ్రి , రాజానగరం మధ్య సుమారు 2 గంటల పాటు వాహనాలను ఆపేశారు. దీంతో వాహన చోదకులు అవస్తలు పడ్డారు. స్థానిక ప్రయాణికులు, దినసరి కూలీలు, ఇతరులు రెండు గంటలపాటు ఎండలోనే పడిగాపులు పడాల్సి వచ్చింది.
సీఎం పర్యటన అంటే హడలిపోతున్న జనం: గత కొంత కాలంగా సీఎం పర్యటనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ ఏదైనా ప్రాంతంలో పర్యటిస్తున్నారంటే ఆ ప్రాంతలోని చెట్లను నరకడం, స్థానిక వ్యాపారాలను ముయించేయడం జరుగుతుంది. సీఎం వచ్చి వెళ్లే వరకూ గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచిచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటూ స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.