మనబడి నాడు - నేడు రెండోదశకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా ఆంక్షలు పాటిస్తున్నామని.. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న చోట బడులు తెరిచామని సీఎం జగన్ అన్నారు. పేద విద్యార్థుల జీవితాల్లో మార్పులు రావాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరంలో మొదటి విడత ‘నాడు-నేడు’తో ఆధునికరించిన పాఠశాలలను విద్యార్థులకు అంకితమిచ్చారు. అనంతరం ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తరగతి గదిలో 20 మంది కంటే ఎక్కువ ఉంచొద్దన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
విద్యార్థులకు పుస్తకాలు సహా అన్ని వస్తువులు అందజేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యాకానుక కింద రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలు, బ్యాగు అందిస్తున్నామని.. ప్రతి విద్యార్థికీ నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ, 3 జతల దుస్తులు, బూట్లు, బెల్టు, సాక్సులు ఇస్తున్నట్లు వివరించారు. విద్యాకానుక కిట్ల నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదన్నారు. ఈ పథకం కింద ఈ ఏడాది రూ.1,380 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దీంతో 42లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ‘నాడు-నేడు’ రెండో దశకు నేటి నుంచే శ్రీకారం చుడుతున్నట్లు జగన్ చెప్పారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడులు, హాస్టళ్ల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయని జగన్ చెప్పారు.
పి.గన్నవరంలో ఉన్నత పాఠశాలను సందర్శించిన సీఎం
అంతకుముందు.. పి.గన్నవరం జడ్పీ పాఠశాలను సీఎం జగన్ సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. పి.గన్నవరంలోని భవిత కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. మానసికి స్థితి బాగాలేని చిన్నారుల తల్లిదండ్రులతో సీఎం జగన్ మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్‌పై కాసేపు కూర్చోని వారితో ముచ్చటించారు.
బోర్డుపై ఆల్ ద వెరీ బెస్ట్
నేటి నుంచి బడులు ప్రాంరంభమైన సందర్భంగా బోర్డుపై 'ఆల్ ద వెరీ బెస్ట్' అని రాశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక కిట్లు, స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించారు.
ఇదీ చదవండి