గౌతమీ గోదావరి తీరంలో వీస్తున్న గాలులకు.. తూర్పు గోదావరి జిల్లా యానాంలో చీరమేను పైకి తేలింది. రెండు రోజులుగా చోటుచేసుకున్న వాతావరణ మార్పులు.. మత్స్యకారుల ఇంట కాసులు కుమ్మరించాయి. గత వారంలో రోజంతా కష్టపడినా చిన్న బకెట్ చేపలు దొరకక నిరాశ చెందినవారు.. ఈరోజు బిందెలు, బకెట్లు నిండుగా భారీ స్థాయిలో చీరమేనుతో మార్కెట్‌కి వచ్చారు. అవకాశం ఉన్నంత మేరకు సొమ్ము చేసుకున్నారు.
యానాం ప్రధాన మార్కెట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి మాంసాహార ప్రియులు ఎక్కువగా వస్తుంటారు. భారీస్థాయిలో చీరమేను లభించడంతో.. విభిన్న పద్ధతుల్లో జరిగే వేలం పాటలో రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు ధర పలికింది. ఏడాదికి ఒకసారైనా ఆ చేపలను తినాలనే ఆశతో.. డబ్బులకు వెనకాడకుండా వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇతర ప్రాంతాల్లోని బంధువులకు పంపేందుకు ప్రజలు తరలిరావడంతో.. గోదావరి తీరమంతా వాహనాలతో నిండిపోయింది.
దీపావళి అమావాస్యకు ముందు వీచే తూర్పు గాలులకు.. సముద్రం అడుగున జీవించే చీరమేనుపైకి తేలింది. అతిచిన్న పరిమాణం గల ఈ చేపలు.. గుంపులుగా గోదావరి నది పాయల్లోకి ఈదుకుంటూ వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి 10లోపు విహరించాయి. ప్రత్యేక వలలు, చీరలతో మత్స్యకారులు వాటిని పట్టుకొని.. బిందెలు, బకెట్లలో మార్కెట్లకు తీసుకువచ్చారు.
ఇదీ చదవండి: యానాంలో కొనసాగుతున్న అనిశ్చితి...వారం గడిచినా తెరుచుకోని బడి...