CBN Breakfast Fruit salad : రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ ను ఆయన సిబ్బంది తీసుకెళ్లారు. చంద్రబాబుకు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో కుటుంబ సభ్యులు ఫ్రూట్ సలాడ్ ను ఆహారంగా పంపారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు. అలాగే మధ్యాహ్నం భోజనం గా 100గ్రాములబ్రౌన్ రైస్,బెండకాయవేపుడు, పన్నీరుకూర, పెరుగును కుటుంబ సభ్యులు జైలు అధికారులకుఅందజేశారు.మధ్యాహ్నంమూడు గంటలకు టీ తాగేందుకువేడి నీళ్లు కూడా అందించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆసుపత్రిలో పరీక్షలు చేయనున్నారు. చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ ( Mulakat ) కు అధికారులు అనుమతినిచ్చారు.
నాలో కోపం కట్టలు తెంచుకుంటోంది.. చేయని నేరానికి తన తండ్రిని అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని నారా లోకేశ్ ట్వీట్ ( Nara Lokesh's tweet ) చేశారు. కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని లోకేశ్ గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి.. ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలి..? రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఆయన ఇతరులకంటే ముందుగా ఊహించినందుకేనా? అని ప్రశ్నించారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో రాస్తున్నానని పేర్కొన్నారు.
Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
‘ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం తన శక్తిని ధారపోయడం చూస్తూ పెరిగానన్న లోకేశ్.. లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మా నాన్నకు విశ్రాంతి రోజంటూ తెలియదు... ఆయన రాజకీయాలు ఎప్పుడూ హుందాతనంగా, నిజాయతీగా ఉంటాయి అని పేర్కొన్నారు. సేవలను పొందినవారి ప్రేమ, కృతజ్ఞతల నుంచి ఆయన ఆస్వాదించిన లోతైన ప్రేరణను చూశా... వాళ్ల హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపాయి అని ట్వీట్ చేశారు. నేనూ ఆయన నుంచి ప్రేరణ పొంది అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకొని భారత్‌కు తిరిగొచ్చానని పేర్కొన్న లోకేశ్.. మన దేశం, వ్యవస్థలు, అన్నింటికిమించి మన రాజ్యాంగం ( Constitution ) పై నమ్మకం ఉంది’ అని తెలిపారు.
‘ఈ రోజు ద్రోహంలా అనిపిస్తోంది. మా నాన్న పోరాటయోధుడు. నేను కూడా అంతే. రాష్ట్రం కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తిరుగులేని శక్తితో మేం ఎదుగుతాం... ఈ యుద్ధంలో నాతో చేరమని మిమ్మల్ని కోరుతున్నా’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.
పాదయాత్రకు బ్రేక్.. యువగళం పాదయాత్రకు లోకేశ్ కొన్ని రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్ర శుక్రవారం నాటికి డా.బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పొదలాడకు చేరుకుంది. పరిస్థితులు సర్దుకున్నాక మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు.