తూర్పుగోదావరి జిల్లాలో అదృష్టవశాత్తు ఈ ఏడాది వరద జాడ లేదు. గతేడాది జులై నుంచి ఆగస్టు నెలాఖరు వరకు వరద గ్రామాలను ముంచేసింది. అప్పట్లో లాంచీల్లోనే ప్రజలకు నిత్యావసరాలు చేరవేయడంతో పాటు ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ఇప్పుడు లాంచీల జాడ కనిపించడం లేదు.
అసలు విషయం ఏమిటంటే..
లాంచీలు నడిపే సరంగుల (చోదకులు) లైసెన్సులు రెన్యువల్ చేయడంపై సందిగ్ధత ఏర్పడింది. గతంలో జలవనరుల శాఖ లైసెన్సులను రెన్యువల్ చేసేది. 2017లో కృష్ణా నదిలో జరిగిన లాంచీ ప్రమాదంతో నాటి సర్కారు సరంగుల సామర్థ్యం పోర్టు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినా పెద్దగా అమలులోకి రాలేదు. 2019లో కచ్చులూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంతో నిబంధనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సరంగులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 60 ఏళ్ల వయసుకు లోబడి ఉండాలని, పోర్టు నిబంధనల ప్రకారం వారికి బోటు నడిపే సామర్ధ్యం ఉండాలని, పోర్టు వారి లైసెన్స్ ఉంటేనే లాంచీలు నడపాలని ప్రభుత్వం సూచించింది. అవన్నీ ఉన్న సరంగు ఒక్కరూ లేకపోవడంతో ఇప్పుడు లాంచీల రాక ప్రశ్నారకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జలవనరుల శాఖ మంజూరు చేసిన లైసెన్సులను రెన్యువల్ చేయాలని పోర్టు అధికారులకు ఆదేశాలిచ్చింది. దీనిపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు జులైలో విడివిడిగా లాంచీల యజమానులతో సమావేశాలు నిర్వహించి వరద ప్రాంతాలకు లాంచీలు పంపాలన్నారు. సరంగుల విషయం తప్ప లాంచీలు పంపడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని యజమానులు వివరించారు.
సరంగుల నుంచి అభ్యంతరాలు
సరంగులు మాత్రం సానుకూలంగా లేరు. కేవలం వరదల సమయం మూడు నెలలకు లైసెన్సులు రెన్యువల్ చేసి తమ సేవలు వినియోగించుకోవాలని చూస్తున్నారంటున్నారు. వరదల తర్వాత లాంచీలు, బోట్లు నడిపేందుకు అవకాశమిస్తే తాము ముందుకు వస్తామంటున్నారు. ఈ మేరకు వారు తూర్పు గోదావరి కలెక్టర్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడు మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ మండలాల్లో సాయం కోసం ఏటా దాదాపు 25 లాంచీల అవసరం ఉంటుంది. గతేడాది వరదలకు దేవీపట్నం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం మండలాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో లాంచీల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
ఒడ్డునే పర్యాటక బోట్లు
కరోనా మహమ్మారి నదీ పర్యాటక రంగంపై సైతం తీవ్ర ప్రభావం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో దిండిలో హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్ పన్నెండేళ్ల నుంచి నిర్వహణలో ఉంది. రిసార్ట్స్‌తో పాటు వశిష్ఠ నదిలో నదీ విహారం కూడా నిర్వహిస్తున్నారు. దిండితో పాటు జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడల్లో కూడా బోటింగు నిర్వహణ ఉంది. దాదాపు 10 నెలల నుంచి ఈ బోట్లు ఒడ్డుకే పరిమితమయ్యాయి. గతేడాది కచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదం నాటి నుంచి దిండి, కాకినాడ, రాజమహేంద్రవరం, పట్టిసీమలోని బోట్లను నిలిపివేశారు. తరువాత వాటికి ఫిట్‌నెస్ తనిఖీల నిమిత్తం గత మార్చిలోనే గట్టెక్కించారు. తరువాత కరోనా మహమ్మారి విజృంభణతో తనిఖీల నిర్వహణలో జాప్యం నెలకొంది.
ఇదీ చూడండి
కేజీబీవీ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన