గోదావరిలో పర్యాటక బోటు మునిగిన 16 రోజుల తర్వాత వెలికితీత పనులను తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం చేపట్టింది. కాకినాడకు చెందిన మత్స్యకార నిపుణుడు దర్మాడి సత్యం బృందం బోటు వెలికితీసే పనులు ప్రారంభించింది. బోటు మునిగిని ప్రాంతమైన దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద.... రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. 2 వేల మీటర్ల ఉక్కు గొలుసులతో బోటును బయటకు తీసేందుకు చర్యలు ఆరంభించారు. వీరికి ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, జలవనరులశాఖ అధికారుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
ఒడ్డున ప్రొక్లెయిన్‌కు ఆ గొలుసును కట్టి... నదిలో ఉన్న ఫంటుతో పలుసార్లు లాగేందుకు ప్రయత్నించారు. వరదప్రవాహం తగ్గినా.... బోటు ఉన్న ప్రాంతంలో సుడులు తిరగడం వల్ల పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. తీవ్రమైన ఎండ, ఉక్కపోత కాస్త ఇబ్బంది కలిగిస్తోందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇవాళ బోటు వెలికితీత పనులకు... నిన్న చేసిన ప్రయత్నాలు ఉపకరిస్తాయని ధర్మాడి సత్యం తెలిపారు. బోటును బయటకు తెచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామన్నారు.
చూస్తుండగానే మునిగిపోయిన బోటు... బయటకు తీస్తే చూద్దామని చుట్టుపక్కల గిరిజన గ్రామస్థులు పెద్దసంఖ్యలో కచ్చులూరుకు చేరుకున్నారు. కొండలు, వాగులు, వంకలు దాటుకుని... రెస్క్యూ ఆపరేషన్ చూసేందుకు వచ్చారు. తొలిరోజు ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. బోటు బయటకు వస్తే తాము సంతోషిస్తామని... ప్రమాదం జరిగినప్పటి నుంచీ తాము బాధపడుతున్నామని... గిరిజనులు చెప్పారు. నదీప్రవాహం మరింత తగ్గితే బోటు వెలికితీత సులభమయ్యే అవకాశాలున్నాయి. ఇవాళైనా బోటు వస్తుందేమోనని రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది.