రాష్ట్రంలో సంచలం కలిగించిన సీతానగరం శిరోముండనం వ్యవహారంలో అసలు దోషుల్ని అరెస్ట్ చేయాలంటూ... తూర్పుగోదావరి జిల్లాలో దళిత సంఘాలు, వివిధ పక్షాలు నిరసన చేపట్టాయి. రాజమహేంద్రవరంలో మాజీఎంపీ హర్షకుమార్ బాధితుడు ప్రసాద్‌తో కలిసి ఒక్కరోజు నిరసన దీక్ష చేశారు. దళితులపై జరుగుతున్న దాడుల గురించి గవర్నర్, రాష్ట్రపతికి విన్నవిస్తామని తెలిపారు. వైకాపా సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని కోరనున్నట్టు తెలిపారు.
శిరోముండనం బాధితుడు ప్రసాద్ సోదరుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి దళిత సంఘాలు, నాయకులు నిరసన తెలిపారు.
అసలు దోషుల్ని ఉరి తీయాలని తెలుగుదేశం ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మోకా ఆనంద్ సాగర్ కాకినాడలో డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన ఇసుక లారీ ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ బాధితుడు విజయ్‌బాబు వీడియో సందేశం విడుదల చేశారు. తనను ఇసుక లారీ ఢీకొట్టలేదని, మునికూడలి నుంచి తన స్వగ్రామం ముగ్గళ్ల వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపాడు. ఇసుక లారీ ఢీకొట్టడం వల్లే గాయపడ్డాడని తెలిపే సంభాషణతో కూడిన మరో దృశ్యాలు కూడా వెలుగులోకి రావడం విశేషం.
ఇదీ చదవండీ... అమానుషం : కరోనా బాధితుల్ని ఇంట్లో పెట్టి తాళం వేసిన యజమాని