ఆమె 9 నెలల నిండు గర్భిణీ. మరో వారం రోజుల్లో ప్రసవం అవుతుందని వైద్యులు తేదీ కూడా ఖరారు చేశారు. ఇలాంటి సమయంలో ఏ మహిళైనా విశ్రాంతి తీసుకుంటారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన లీలారాణి మాత్రం 9 నెలల గర్భంతో కొవిడ్ విధులకు హాజరవుతోంది. అధికారులు సెలవులు తీసుకోమని చెప్పినప్పటికీ... తనకు విధులే ముఖ్యమంటూ ప్రజలకు సేవలందిస్తోంది.
కరోనా కేసులున్నా విధులు
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎంగా సేవలందిస్తోంది లీలారాణి. నిండు గర్భిణీ అయిన ఈమె... నిత్యం కొవిడ్ విధులకు హాజరవుతున్నారు. మరో వారం రోజుల్లో ప్రసవం జరుగుతుందని వైద్యులు చెప్పినా... విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆమెకు అప్పగించిన కాండ్రేగుల సబ్ సెంటర్ పరిధిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో ప్రజలకు తన అవసరముందని ఆమె భావించింది. అనుమానితులను నిత్యం జగ్గంపేటకి తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తున్నారు.
విధి ప్రధానమని..
లీలారాణి గర్భిణీ కావటంతో అధికారులు ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. కుటుంబ సభ్యులు సైతం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోమని ఆమెకు చెప్పారు. అయినా విధుల నిర్వహణే దైవసమానంగా భావించి పేదలకు సేవలందిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చే సమయం ఆసన్నమవుతున్నా... ఆనందంగా కరోనా బాధితులకు సేవలందిస్తున్న లీలారాణిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదీ చదవండి