Lands for YCP offices: వైసీపీ కార్యాలయాలకు పలు జిల్లా కేంద్రాల్లో భూములు కేటాయిస్తూ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. బహిరంగ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ ఉన్న భూములను పార్టీ కార్యాలయాలకు కేటాయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు నగరం ప్రధాన కూడలిలో ఆర్‌ఎస్ రోడ్డు వై.జంక్షన్ వద్ద ఏపీ ఆగ్రోస్‌కు సర్వే నంబరు 95-2బిలోని ఉన్న 1.60 ఎకరాల ఖాళీ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.వంద కోట్ల పైమాటే. అయితే దీన్ని కొన్నేళ్లపాటు లీజుకు ఇచ్చారా లేక పూర్తిగా కేటాయించేశారా అనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు లేకపోయినా..: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంలో వైసీపీ కార్యాలయానికి రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు దొరక్క పరాయి పంచన ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యాలయానికి ఆగమేఘాల మీద ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం విమర్శలపాలవుతోంది. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం విలువ రూ.50 వేలకు పైనే ఉంటుందని అంచనా. ఈ లెక్కన రూ.48 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ధారాదత్తం చేసినట్లే.
అనంతలో రూ.30 కోట్ల స్థలం వైసీపీకే!: అనంతపురం నగర నడిబొడ్డున హెచ్చెల్సీ కాలనీ పరిధిలో జిల్లా జలవనరుల శాఖకు చెందిన 1.5 ఎకరాల స్థలాన్ని వైసీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు కోసం కేటాయించేందుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించినట్లు సమాచారం. నీటిపారుదల శాఖకు చెందిన స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఎజెండాలోని 52వ అంశంలో పేర్కొన్నారు. ఇది అనంతపురం జలవనరుల శాఖకు చెందిన స్థలమేనని తెలుస్తోంది. దాదాపు రూ.30 కోట్ల విలువైన ఈ స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి కేటాయించేందుకు త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వు జారీ చేయనున్నట్లు చెబుతున్నారు.
ఇవీ చదవండి: