YSRCP ZPTC HUSBAND SMUGGLING RED SANDAL: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు వైకాపా జెడ్పీటీసీ స్వరూప రెడ్డి భర్త కూరపర్తి మహేందర్ రెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు పీలేరు-తలపల మార్గంలో పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఆ మార్గంలో వేగంగా వస్తున్న రెండు ఇన్నోవా వాహనాలను టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాల కోసం అడ్డుకున్నారు. ఆ సమయంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న కొందరు స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు.
పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేయగా.. అందులో 17 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. దీనితో పాటు ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అందరూ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చిన్నగొట్టిగల్లుకు చెందినవారుగా పోలీసులు నిర్ధారించారు.
తొలుత వారిని పీలేరు పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారించారు. వీరిలో అధికార పార్టీకి చెందిన జెడ్పీటీసీ స్వరూపారెడ్డి భర్త మహేందర్ రెడ్డి ఉండడంతో చిత్తూరుకు తరలించారు. నిందితులు ఎర్రచందనం దుంగలను బెంగుళూరులోని అంతర్జాతీయ స్మగ్లర్ ఇమ్రాన్ షరీఫ్ వద్దకు తరలిస్తున్నట్లు విచారణలో పోలీసులు కనుగొన్నారు.
పట్టుబడ్డవారిలో బెల్లంకొండ కృష్ణయ్య, మల్లేశ్వర్ అనే నిందితులు ఉండగా.. పారిపోయిన మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన వారు ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైకాపా నేత భర్త నేరుగా స్మగ్లింగ్‌లో భాగస్వామి కావడంపై అక్కడి స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి:
AMARAVATHI FARMERS: శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న అమరావతి రైతులు