చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లో వివిధ కారణాలతో భర్తలు చనిపోవటమో.. లేక అనారోగ్యంతో వ్యవసాయానికి దూరమైతే.. మరో పని తెలియని సతులు వారి స్థానంలో నాగళి పట్టుకొని భూమితో పోరాటానికి సిద్ధమయ్యారు. పిల్లలను చదివించుకునేందుకు మరో దారి తెలియక.. భూమి తల్లినే నమ్ముకొని బతుకుతున్నారు.
ప్రకృతి వైపరిత్యాలకు తోడు.. గిట్టుబాటు ధరలు లేకపోవటం పెట్టుబడులు కూడా దక్కడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాల సేద్యంలో నష్టాల బాట పట్టామని కొందరు మహిళ రైతులు కంటతడి పెడుతున్నారు.
మగ తోడు లేకున్నా, భూమి తోడుగా ఉంటుందని ఆశించి.. రాత్రి పగలు కష్టపడితే కష్ట నష్టాలు తప్పా.. ఆశించిన స్థాయిలో ఆదాయం లేదంటూ తల్లడిల్లుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై కరుణ చూపి.. మహిళా రైతులకు ప్రత్యేక రాయితీలు, వ్యవసాయ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.