అల్లుడితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన మండలంలోని కంచెంవారిపల్లె సమీపంలో జరిగింది. సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్సై లక్ష్మీకాంత్ కథనం మేరకు.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీకి చెందిన నాగరాజ(51), మంజులకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమార్తె రాణిని బంగారుపాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు సుబ్రహ్యణ్యంతో మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకొంది.
మద్యం తాగించి అతి కిరాతకంగా...
వారం రోజుల కిందట సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కుమార్తె రాణి ఇంటికి మంజుల వచ్చింది. ఆమె కోసం భర్త నాగరాజు గత ఆదివారం ఇర్లపల్లెకు వచ్చాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చేందుకు భార్య, అల్లుడు పథకం వేశారు. ఇద్దరూ కలిసి భర్తను కంచెంవారిపల్లె సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించారు. అనంతరం కర్రలు, రాళ్లతో కొట్టి చంపి వడ్లవాణి కుంటలో పడేసి వెళ్లిపోయారు. నీటిలో తేలుతున్న శవాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్షలకు పంపి దర్యాప్తు చేశారు. నిందితులు మంజుల, సుబ్రహ్మణ్యాన్ని నెల్లిమంద వీఆర్వో సమక్షంలో శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు సీఐ వివరించారు. మూడు రోజుల్లో కేసు ఛేదించిన ఎస్సై లక్ష్మీకాంత్‌ను సీఐ అభినందించారు.
ఇదీ చదవండి: చర్చనీయాంశంగా కొండపల్లి మైనింగ్ వివాదం.. మరోసారి సర్వేకు పట్టు