చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన మూడేళ్ల బాలిక జాహ్నవి పుట్టుకతోనే వినికిడి సమస్య ఎదుర్కొంటోంది. వీరికి చిన్నతనంలోనే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేస్తే.. వినికిడితో పాటు మాటలు వచ్చే అవకాశం ఉంది. ఈ సర్జరీకి ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ఏపీ సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొన్నారు. జాహ్నవిని హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చేర్చారు. పరిశీలించిన ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.విష్ణుస్వరూప్‌రెడ్డి చిన్నారికి బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.
చిన్నారి విషయం తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య శస్త్రచికిత్సకు తన వేతనం నుంచి రూ.2 లక్షలు, స్వర్ణభారతి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ రూ.లక్ష అందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏపీ సీఎం సహాయ నిధి నుంచి రూ.12 లక్షలు విడుదల చేయించారు.
దాతల నుంచి సాయం అందడంతో ఆస్ట్రేలియా నుంచి పరికరాలు తెప్పించి ఇటీవలే విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం జాహ్నవి కోలుకుంటోందని డాక్టర్ విష్ణుస్వరూపరెడ్డి తెలిపారు. త్వరలో ఆడిటరీ-వెర్బల్ చికిత్స కూడా ప్రారంభిస్తామని ఏడాదిలోగా మాట్లాడటం కూడా పూర్తిగా నేర్చుకుంటుందని వివరించారు. దాతలకు, వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని జాహ్నవి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి