atms robbery: ఏటీఎం కేంద్రాలలో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. మెషినల్లో సాంకేతిక లోపాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్న హరియాణాకు చెందిన ఆరీఫ్‌ఖాన్, సలీం ఖాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివిధ బ్యాంకుల 99 డెబిట్ కార్డులు, 20 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాలోని 60 వేలు సహా 2 తాళం చెవుల్ని, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
అసలేం జరిగింది?
తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి ఇద్దరు వచ్చి ట్యాంపరింగ్ చేసి నగదు కాజేసినట్లు బ్యాంకు మేనేజరు రమేష్ కుమార్ ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీసీటీవీ ఫుటేజీలు అందించారు. తిరుపతి తూర్పు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండులోని ఎస్‌బీఐ ఏటీఎం దగ్గరున్న నిందితుల్ని సీఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్సై ప్రకాష్‌కుమార్ అదుపులోకి తీసుకుని విచారించారు. హరియాణా రాష్ట్రం నుహ్‌జిల్లా పిప్రోలి గ్రామానికి చెందిన ఆరిఫ్‌ఖాన్ (25), సలీంఖాన్‌గా (25) వారిని గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు తిరుపతిలోని తూర్పు, పడమర పీఎస్‌లు, ఎస్వీయూ, తిరుచానూరు పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఆరు కేసుల్లో వీరు నిందితులు. వీరికి సహకరించిన నకీబ్ హుస్సేన్, ఇలియాస్, హక్ముదీన్ పరారీలో ఉన్నారు.
ఇదీ చూడండి: AUTO ACCIDENT: లారీ ఢీకొని.. వాగులో ఆటో బోల్తా