ఉద్యాన పంటలకు చిత్తూరు జిల్లా పడమటి మండలాలు పెట్టింది పేరు. ఇక్కడ వేల ఎకరాల్లో జామ, కర్బూజా, పుచ్చ వంటి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. గడచిన ఏడాదిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా కష్టాలను ఓర్చుకుంటూ ఈ సారి రైతులు పెట్టుబడులు పెట్టారు. మధ్యలో చీడపీడలు పంటలకు సోకినా కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. ఇంతా చేస్తే ఇప్పుడు కరోనా మహమ్మారి ఉద్యాన రైతులను నిండా ముంచేసింది. రామసముద్రం, మదనపల్లె, పలమనేరు తదితర కర్ణాటక సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లో రైతుల పరిస్థితి దీనంగా ఉంది. ప్రత్యేకించి రామసముద్రం మండలంలో జామరైతులు కాయలను అమ్ముకోలేక రవాణా సౌకర్యాలు కానరాక గుండెదిటవు చేసుకుని పంటలను పొలాల్లోనే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది.
లాక్డౌన్ కారణంగా కూలీలు అందుబాటులో లేకపోవటం ఓ కారణమైతే కోసిన పంటలను అమ్ముకునేందుకు వీలులేని పరిస్థితి. కర్ణాటక సరిహద్దు గ్రామల్లోని రైతులు కాయలను మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాలు సైతం లేక అవస్థలు పడుతున్నారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి పండించిన పంటలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఆయా మండలాల్లో పంటల ఆధారంగా... మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతన్నలు కోరుతున్నారు. మారుమూల సరిహద్దు గ్రామాలకు రవాణా సౌకర్యాలను కల్పించటం ద్వారా తమను కష్టాలనుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: