చిత్తూరు జిల్లాలో మూడు దశల్లో ఏడు మండలాల్లోని 220 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. పోలీస్ జిల్లా పరిధిలో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని.. ఆ ప్రాంతాల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తిరుపతి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఈటీవీ భారత్’ ముఖాముఖిలో మాట్లాడారు.
ఈటీవీ భారత్ : పంచాయతీ ఎన్నికలలో ఏర్పాట్లు ఎలా చేశారు..?
అర్బన్ ఎస్పీ : సమస్యాత్మక ప్రాంతాల్లో గత పరిస్థితులు నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్తున్నాం. మొత్తం 371 ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుండగా 153 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించాం. సమస్యలను సృష్టిస్తారనుకునే వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం.
ఈటీవీ భారత్ : హింసాత్మక ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
అర్బన్ ఎస్పీ : ప్రశాంత ఎన్నికలకు అవగాహన అవసరం. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు ప్రజలు అటు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. అధికారులు సైతం శాంతిభద్రతలను కాపాడేందుకు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కష్టపడుతున్నారు. ప్రశాంత ఎన్నికలు జరిగేందుకు ప్రజల్లోనూ అవగాహన ముఖ్యం.
ఈటీవీ భారత్ : గ్రామీణ ప్రాంతాల్లోని ఘర్షణలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?
అర్బన్ ఎస్పీ : సమస్యలు ఎదురయ్యే ప్రాంతాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. షాడో బృందాలను ఏర్పాటు చేసి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. స్వేచ్ఛాయుత ఎన్నికలు కావాలంటే చట్ట ప్రకారం పనిచేయాల్సి ఉంది. దీన్ని అమలు చేసేందుకు పోలీసుశాఖ ఎప్పుడూ ముందుండి పనిచేస్తుంది. పోలీసులపై విశ్వసనీయత ఉన్నంతకాలం ప్రజలు తమకు సహకరిస్తూనే ఉంటారు. సరిహద్దుల నుంచి అక్రమ మద్యం రాకుండా ఉండేందుకు చిత్తూరు, ఎస్‌ఐబీతో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తాం.
ఇదీ చూడండి.