తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.84 కోట్ల అంచనాలకు స్మార్ట్‌సిటీ పాలకమండలి ఆమోదం లభించింది. తిరుపతి స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీ 19వ పాలకమండలి సమావేశం శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడి హోదాలో జిల్లా సచివాలయం నుంచి జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా పాల్గొన్నారు. ఎండీ హోదాలో కమిషనర్ పి.ఎస్.గిరీష 23 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. భవన నిర్మాణానికి రూ.75 కోట్లు, ఐటీసీ పరికరాలకు రూ.9 కోట్ల వాస్తవ అంచనాలను ఇంజినీరింగ్ అధికారులు సమర్పించగా సభ్యులు ఆమోదం తెలిపారు.
ప్రస్తుత నగరపాలిక కార్యాలయ ఆవరణలోనే నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కొరమేనుగుంట, పూలవానిగుంట, కొంకా చెన్నాయగుంట, గొల్లవాని గుంటల సుందరీకరణ కోసం రూ.6 కోట్లు, రేణిగుంట రోడ్డులోని పెంతెకొస్తు చర్చి నుంచి కొత్తపేట వరకు కొరమేనుగుంట కాలువ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరుకు ఆమోదం లభించింది. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు నగరపాలిక సిబ్బందికి అవసరమైన పరికరాలు, వాహనాల కొనుగోలుకు అనుమతులు లభించాయి. తిరుపతి పోలీసులకు ఛార్జింగ్ మోటార్ సైకిళ్ల బదులు పెట్రోలు వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, స్మార్ట్‌సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్‌ఈ మోహన్, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే