తిరుపతి ఉపఎన్నిక పేద ధనికుల మధ్య జరిగే ఎన్నిక అని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భేరి వారి మండపం వద్ద బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. మిగిలిన పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులు కాగా.. వైకాపా అభ్యర్థి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని పెద్దిరెడ్డి వెల్లడించారు. పేదవాడి ప్రజా సేవలను గుర్తు పెట్టుకుని విజయం చేకూర్చాలన్నారు.
'90 శాతం పోలయ్యేలా అవగాహన'
తొంభై శాతం ఓట్లు పోలయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు రాళ్ల డ్రామా చేశారని విమర్శించారు. త్వరలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులకు ఉపయోగకరంగా సోమశిల, స్వర్ణముఖి కాల్వ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
'కుప్పంలో కనీసం తాగునీరు , సాగు నీరు ఇవ్వలేదు'
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు. కుప్పంలో కనీసం తాగు, సాగు నీరు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు చంద్రబాబును ఆదరించడం లేదన్నారు. చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా.. వైకాపా ప్రవేశపెట్టిన వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థను విమర్శిస్తున్నారని బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షులు నడ్డా వ్యాఖ్యలు ఆంధ్రులను కించపరిచేలా ఉన్నాయన్నారు.
'సీఎంను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు'
సీఎం జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసేలా విమర్శలు చేయడం తగదన్నారు. కేంద్రం ఇదే తీరుతో ప్రవర్తిస్తే ఆంధ్ర ప్రజలు భాజపాకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ నెల 17 తర్వాత తెదేపాలో తండ్రీ కొడుకులు తప్ప ఏ నాయకులు ఉండరని ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వైకాపా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ పథకాలను రద్దు చేసే దమ్ము ధైర్యం ఏ పార్టీకి లేదని అన్నారు.
ఇవీ చూడండి : వైకాపా అభ్యర్థి, వాలంటీర్లపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం: సునీల్ దేవధర్