compassionate appointment : కారుణ్య నియామకం కింద ఫలానా పోస్టు కావాలని సంబంధిత వ్యక్తులు కోరలేరని హైకోర్టు స్పష్టం చేసింది. తనకు వీఆర్‌వో లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టును ఇచ్చేలా కలెక్టర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ 2018లో ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. న్యాయమూర్తులు జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.
చిత్తూరు జిల్లా తంబాళపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ జి.మధుసూదనరావు మృతి చెందారు. ఆయన తనయుడు రాఘవేంద్రరావు తనకు కారుణ్య నియామకం కింద పోస్టు ఇవ్వాలని కలెక్టర్‌కు వినతి సమర్పించారు. దీంతో ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. రాఘవేంద్రరావు అప్పటికి ఇంటర్మీడియెట్ విద్యార్హత కలిగి ఉండటంతో చిత్తూరు జిల్లా పంచాయతీ కార్యాలయంలో 2014లో ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇచ్చారు. ఆ ఉద్యోగంలో చేరినట్లు రిపోర్టు చేయకపోవడంతో రాఘవేంద్రరావు దానిని కోల్పోయారు. మరోసారి కలెక్టర్‌కు వినతి సమర్పిస్తూ వీఆర్‌వో లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలని అభ్యర్థించారు. కలెక్టర్ అందుకు అంగీకరించలేదు.
కారుణ్య నియామకం కింద పిటిషనర్‌ను వీఆర్‌వోగా నియమించడానికి వీల్లేదన్నారు. తన అభ్యర్థనను కలెక్టర్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ రాఘవేంద్రరావు ఏపీ పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. జోక్యం చేసుకోవడానికి ట్రైబ్యునల్ నిరాకరిస్తూ 2018లో ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలుచేస్తూ 2019లో రాఘవేంద్రరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాన్ని కొట్టేసింది. పిటిషనర్ డిగ్రీ ఉత్తీర్ణుడు కానందున కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యేందుకు అర్హుడు కాడని స్పష్టం చేసింది. ఆఫీసు సబార్డినేట్‌గా ఇచ్చిన పోస్టును సద్వినియోగం చేసుకోక దానిని కోల్పోయారని తెలిపింది.
High Court on Postponement of Maha Kumbhabhishekam in Srisailam: శ్రీశైలంలో ఈనెల 25 నుంచి 31 వరకు నిర్వహించతలపెట్టిన మహా కుంభాభిషేకం.. వాయిదా వేస్తూ దేవదాయశాఖ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తి చేసినందున షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.
కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. వాయిదా వేయడానికి ముందు ఎవర్ని సంప్రదించలేదని.. ఏర్పాట్ల కోసం ఇప్పటికే 3కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారన్నారు. ఓ ఆహ్వానితుడు కుంభాభిషేకానికి రానంత మాత్రానా కార్యక్రమాన్ని వాయిదా వేయడం సరికాదని.. వడగాడ్పులు కారణమని బయటకు చెబుతున్నా.. అంతర్గతంగా ఇతర కారణాలున్నాయని వాదించారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఆ రోజుల్లో కుంభాభిషేకం నిర్వహిస్తే భక్తులకు ఇబ్బంది తలెత్తుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు.
కమిషనర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. మహా కుంభాభిషేకం వాయిదా వేయడంపై దేవాదాయ కమిషనర్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ఎవర్ని సంప్రదించి గత ముహుర్తాన్ని నిర్ణయించారు? కార్యక్రమాన్ని వాయిదా వేసే విషయంలో వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారా? అని హైకోర్టు నిలదీసింది. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లకు ఇప్పటి వరకు ఎంత ఖర్చుచేశారు? వాయిదా వేయడం వల్ల ఆ సొమ్ము వృథా అవుతుందా? వంటి సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది.
ఇవీ చదవండి :