అనారోగ్యంతో కన్నుమూసిన తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ సాగిన అంతిమయాత్రలో అభిమానులు, పార్టీ శ్రేణులు పొల్గొన్నారు. శివప్రసాద్ అందరితో సాన్నిహిత్యంగా మెలుగుతూ పార్టీలకతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారని రాజకీయ, సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
అంతకుముందు శివప్రసాద్ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చి తిరుపతి ఎన్జీవో కాలనీలోని స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించారు.
స్నేహితుడ్ని కోల్పోయా
శివప్రసాద్ పార్థివదేహానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి, అమర్‌నాథ్ రెడ్డి నివాళులు అర్పించారు. శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతిమయాత్రలోనూ పాల్గొన్న చంద్రబాబు బాల్య స్నేహితుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ రాష్ట్ర సమస్యలను విభిన్నశైలిలో దిల్లీ స్థాయిలో వినిపించారని గుర్తు చేసుకున్నారు.
శివప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేస్తాం
శివప్రసాద్ భౌతికకాయానికి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. శివప్రసాద్‌తో తనకు చిన్ననాటి నుంచి గుర్తుంచుకోదగిన ఙ్ఞాపకాలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెవిరెడ్డి ప్రకటించారు. శివప్రసాద్ వ్యక్తిగతంగా తనకు అన్నలాంటి వారన్న ఆయన పార్టీలకతీతంగా అందరితో కలిసిమెలసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ ఙ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా స్మారకం ఏర్పాటు చేస్తామని అన్నారు.
అణగారిన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన నేతను కళ్లారా చూసుకునేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తిరుపతి ఎన్జీవో కాలనీ నుంచి చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ జరిగిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ రీతిలో శివప్రసాద్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.
ఇవీ చదవండి