AP Government MoU with FSSAI : రాష్ట్రంలో ప్రజలకు మరింత పటిష్టమైన ఆహార భద్రత కల్పించడంతోపాటు ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో ప్రభుత్వం 88.41 కోట్ల అంచనా వ్యయంతో న్యూఢిల్లీలో అవగాహనా పత్రాన్ని కుదుర్చుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమీషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ అవగాహనా పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాల్ని బలోపేతం చేసి పటిష్టమైన ఆహార భద్రతను కల్పించేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ ముందుకొచ్చింది. ఇందుకోసం పూర్తి సహకారాన్ని అందిస్తామని ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి.కమలవర్ధనరావు స్పష్టం చేశారు.
ప్రధానంగా ఏపీలో ఆహార పరీక్షల ప్రయోగశాలలుఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా 2024-25 సంవత్సరంలో 20 కోట్లతో తిరుమలలోనూ, మరో 20 కోట్లతో కర్నూలులోనూ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లను నెలకొల్పేందుకు ఎఫ్ఎస్ఎస్ఎఐ అంగీకరించింది. దీంతో పాటు ఈ ప్రయోగశాలల్లో శాంపిళ్ల పరీక్షలకు అవసరమైన ప్రాథమిక వసతులను ఏర్పాటు చేసేందుకు 6.5 కోట్లు, అత్యాధునిక పరికరాల ఏర్పాటుకు 8.46 కోట్లు, మైక్రో బయలాజికల్ లేబరేటరీ ఏర్పాటుకు 4.28 కోట్లను కేటాయించారు. దీంతో పాటు మరో 13 కోట్ల అంచనా వ్యయంతో ఏలూరు, ఒంగోలులలో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలల్ని ఒక్కొక్కటి 6.5 కోట్లతో నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో ఆహార శాంపిళ్ల సేకరణ, విశ్లేషణ కోసం రూ.12 కోట్లు, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 11 కోట్లు కేటాయించేందుకు అవగాహన కుదిరింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరెటరీలతో పాటు అదనంగా మరో 22 ల్యాబరెటరీలను టర్న్ కీ విధానంలో వినియోగించేందుకు రూ.15 కోట్లు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవసరమైన మానవ వనరుల్ని, మౌలిక సదుపాయాల్ని కల్పిస్తామని, తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ఇందుకు దోహదం చేస్తుందన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ సముచిత స్థానం పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఆహార భద్రత విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సత్యకుమార్ విమర్శించారు. అందువల్లే ప్రజలకు పటిష్టమైన ఆహార భద్రతను కల్పించే అంశంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్ఎస్ఎస్ఎఐతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నదని ఆయన వివరించారు. ఆహార భద్రతా అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించి భవిష్యత్తు ప్రణాళికల్ని సిద్ధం చేస్తామన్నారు. ప్రతి జిల్లాకొక ఆహార పరీక్ష ప్రయోగశాల కావాలని కోరగా అందుకు 15 కోట్లు కేటాయిస్తామని ఎఎఫ్ఎస్ఎస్ ఎఐ సిఇఓ కమలవర్ధనరావు అంగీకరించారని మంత్రి తెలిపారు.
140 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మెరుగుపర్చడం ద్వారా గణనీయమైన అభివృద్ధిని సాధించామని ఫుడ్ సేఫ్టీ కమీషనర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. అతి త్వరలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రారంభించి పూర్తి స్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారం - ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు - Tirupati Laddu Ghee Controversy